కాంగ్రెస్ త‌ప్పు చేసిందా?

దేశంలో ఒక‌ప్పుడు ఆధిప‌త్యం చ‌లాయించిన కాంగ్రెస్ పార్టీ ఆ త‌ర్వాత క్ర‌మంగా ప్ర‌భ కోల్పోతూ సాగుతోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ద‌క్కిన ఆద‌ర‌ణ ఓ కార‌ణం కాగా.. కాంగ్రెస్ స్వ‌యంకృతాప‌రాధం కూడా అందుకు మ‌రో కార‌ణం అన్న‌ది కాద‌న‌లేని నిజం. రాష్ట్రాల్లో కీల‌క నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లోపం.. స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌దిద్ద‌లేని అధిష్ఠానం అస‌మ‌ర్థ‌త‌.. వెర‌సి పార్టీ ప‌రిస్థితి నానాటికీ దారుణంగా మారుతుంద‌నేది కాద‌న‌లేని నిజ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ నేత‌ల మ‌ధ్య త‌లెత్తిన వివాదాల‌ను ప‌రిష్క‌రించ‌డంలో విఫ‌ల‌మై చేజేతులారా న‌ష్టాన్ని కొని తెచ్చుకుంటోంది. తాజాగా పంజాబ్‌లోనూ అదే జ‌రిగింది.

రాజ‌కీయ కురువృద్ధుడుగా పేరున్న కెప్టెన్ అమ‌రీంద‌ర్‌కు పంజాబ్ రాజ‌కీయాలపై గొప్ప ప‌ట్టుంది. దేశ‌మంతా మోడీ హ‌వా కొన‌సాగిన 2014 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ రాష్ట్రంలో పార్టీకి ఊహించ‌ని స్థానాల‌ను అమ‌రీంద‌ర్ సాధించి పెట్టారు. 2017 శాస‌న స‌భ ఎన్నిక‌ల్లోనూ పార్టీని విజ‌య‌శిఖ‌రాలకు చేర్చారు. ఆ త‌ర్వాత పంజాబ్‌లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ విజ‌య పరంప‌ర కొన‌సాగ‌డానికి అమ‌రీంద‌రే ప్ర‌ధాన కార‌ణం. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిన‌ప్ప‌టికీ.. పంజాబ్‌లో ఆ పార్టీ అధికారంలో ఉందంటే అందుకు కార‌ణం అమ‌రీంద‌ర్‌.

సైన్యంలో ప‌నిచేసిన అమ‌రీంద‌ర్ రాజీవ్‌గాంధీతో ఉన్న చ‌నువుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. మొద‌టి నుంచి కాంగ్రెస్ వాదిగానే ఉన్నారు. కానీ ఆ పార్టీ నుంచి అకాలీద‌ళ్‌లో చేరినా అది కొద్ది కాలం మాత్ర‌మే. ఆ త‌ర్వాత సొంత పార్టీ పెట్టిన ఆయ‌న‌.. 1998లో దాన్ని కాంగ్రెస్‌లోనే విలీనం చేశారు. పంజాబ్‌లో పార్టీకి బ‌లం ఆయ‌నే. త‌న‌కు చివ‌రి అవ‌కాశం ఇవ్వాలంటూ రాష్ట్రంలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రచారం సాగించిన ఆయ‌న‌.. ఓటర్ల మ‌న‌సు గెలుచుకున్నారు. ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీక‌రం చేశారు. కానీ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత పార్టీలోని ఇత‌ర ఎమ్మెల్యేల గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఒంటెద్దు పోక‌డ‌లు అనుస‌రిస్తున్నార‌ని అమ‌రీంద‌ర్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన న‌వజ్యోత్ సింగ్ సిద్ధును పీసీసీ అధ్య‌క్షుడిగా చేయ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాల‌కు కార‌ణ‌మైంది. అమ‌రీంద‌ర్‌, సిద్ధు మ‌ధ్య ఉన్న విభేధాలు తార‌స్థాయికి చేరాయి. పార్టీలోని ఎమ్మెల్యేలు అమ‌రీంద‌ర్‌పై తిరుగుబావుటా ఎగిరేశారు. దీంతో అధిష్ఠానం అమ‌రీంద‌ర్‌ను దిగిపోమ‌ని చెప్పింది. ఆ అవ‌మానంతోనే సీఎం ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేశారు.

మ‌రో ఏడాదిలోనే పంజాబ్‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గునున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో ముఖ్య‌మంత్రిని త‌ప్పించిన కాంగ్రెస్ ఎలాంటి ఆలోచ‌న‌లు చేస్తోందో అర్థం కాకుండా ఉంది. మొద‌ట సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ సార‌థ్యంలోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటుంద‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఇప్పుడు అమ‌రీంద‌ర్ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌లో ఏం జ‌ర‌గ‌నుందోన‌నే ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతానికి సీఎం ప‌ద‌వికి మాత్ర‌మే రాజీనామా చేసిన అమ‌రీంద‌ర్‌.. పార్టీని వీడే విష‌యంపై ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. కానీ పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే సిద్ధూను సీఎంను చేస్తే క‌చ్చితంగా వ్య‌తిరేకిస్తాన‌ని మాత్రం పేర్కొన్నాడు. మ‌రోవైపు కొత్త సీఎంగా ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే చ‌ర్చ సాగుతోంది. ప్రధానంగా సునీల్ జ‌క్క‌ర్ పేరు వినిపిస్తోంది. అయితే ఎవ‌రు సీఎంగా వ‌చ్చినా.. ప్ర‌స్తుత ప‌రిణామాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీపై క‌చ్చితంగా ప్ర‌భావం చూపుతుంద‌నే అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే ఆ రాష్ట్రంపై బీజేపీ క‌న్ను ఉంది.. అదీ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అక్క‌డ బ‌లోపేతం అయే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో అమ‌రీంద‌ర్ రాజీనామాకు కార‌ణ‌మైన కాంగ్రెస్ త‌ప్పు చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.