ఆల్ట్ మన్ ట్వీట్ కు బాబు రిప్లై… ఊహకే అందట్లేదే

టెక్ జనమంతా సింపుల్ గా శామ్ ఆల్ట్ మన్ అని పిలుచుకునే శామ్యూల్ హారిస్ ఆల్ట్ మన్… భారత్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరిస్తున్న తీరుపై అమితాసక్తి కనబరచారు. ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓగా కొనసాగుతున్న ఆల్ట్ మన్ నే మన భారత ఏఐ రంగం అంతగా ఆకర్షిచిందంటే నిజంగా… మన టెక్నలాజికల్ అప్ గ్రడేషన్ అద్భుతంగా ఉన్నట్టే. అందులో అనుమానం లేదు. ఎందుకంటే వరల్డ్ టాప్ టెక్ కంపెనీలన్నీ భారతీయుల సారథ్యంలోనే ఉన్నాయి.

ఇక దేశంలోనూ నానాటికీ టెక్ జనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాంటి వారిలో తెలుగు ప్రజలదే అగ్ర తాంబూలం. అంటే… దేశంలో ఏ టెక్నాలజీ వృద్ధి చెందుతున్నా.. అందులో తెలుగు నేలదే కీలక భూమిక. ఈ మాట ముమ్మాటికీ నిజమే. ఎందుకంటే… ఆల్ట్ మన్ మన దేశంలో విస్తరిస్తున్న ఏఐ రంగం గురించి ప్రస్తావిస్తే… దానిపై మన పొలిటీషియన్లలో అందరికంటే ముందు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే స్పందించారు. స్పందించడంతోనే సరిపెట్టని చంద్రబాబు… ఏకంగా ఆల్ట్ మన్ కు అదిరిపోయే రీతిలో స్వాగతం కూడా పలికారు.

సరే… అసలు విషయంలోకి వెళితే.. బుధవారం రాత్రి ఆల్ట్ మన్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ పోస్టును పెట్టారు. ”ఏఐని వినియోగించుకుని భారత్ లో జరుగుతున్న పరిణామాలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ తరహా క్రియేటివిటీ అద్భుతంగా ఉంది. ఏఐ వినియోగంలో భారత్ ప్రపంచాన్ని అధిగమిస్తోంది” అంటూ ఆయన ఆ పోస్టులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆల్ట్ మన్ చేసిన ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అయితే ఆల్ట్ మన్ పోస్టును చూసి స్పందించిన వారంతా ఏదో వ్యాపార రంగానికి చెందిన వారో, లేదంటే.. టెక్నాలజీ రంగానికి చెందిన వారో మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా వీరిలో చాలా మంది ఆల్ట్ మన్ పోస్టును తమదైన శైలిలో కొందరు కీర్తిస్తే.. మరికొందరు భారత్ లోని పరిస్థితులను గుర్తు చేస్తూ అవహేళన కూడా చేశారు.

ఆల్ట్ మన్ పోస్టును చంద్రబాబు గురువారం మధ్యాహ్నం చూసినట్టున్నారు. గురువారం కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం భోజనం తర్వాత ఆల్ట్ మన్ పోస్టును చూసిన చంద్రబాబు వెనువెంటనే రియాక్ట్ అయ్యారు. ఆల్ట్ మన్ పోస్టుకు స్పందిస్తూ ఆయనకు రిప్లై ఇచ్చారు. ”మీరనుకుంటున్నది అక్షరాలా సత్యమే. ఏఐలో భారత్ ఇప్పుడే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో భారత్ లోని ఆంధ్రప్రదేశ్ ఏఐ పురోగతిలో వేగంగా ముందుకు సాగుతోంది. దేశంలోనే ఏఐకి కేంద్రంగా మారబోతోంది. ఈ దఫా మీరు భారత్ కు వస్తే తప్పనిసరిగా ఏపీలో పర్యటించండి. ఏఐలో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?.. దానిని తాము ఎలా తీర్చిదిద్దబోతున్నామన్న విషయంపై చర్చిద్దాం. ఏపీ ఒక్క ఏఐకి మాత్రమే పరిమితం కావడం లేదు. క్వాంటం టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం” అంటూ చంద్రబాబు ఆయనకు రిప్లై ఇచ్చారు.

భారత్ లో ఏఐ రంగం విస్తరణపై ఆల్ట్ మన్ పోస్టు., దానికి ఓ రేంజిలో స్పందించి ఆసక్తికర రిప్టై ఇచ్చిన చంద్రబాబు తీరు చూస్తుంటే… అప్పుడెప్పుడో ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఆరంభ దశలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో చంద్రబాబు ముచ్చటించిన సందర్భం ఇట్టే గుర్తుకు వస్తోంది. నాడు ఐటీలో గేట్స్ ను మించిన నిపుణుడు ప్రపంచంలో మరొకరు లేరన్న వాదన వినిపిస్తే.. ఓ రాజకీయ నేతగా చంద్రబాబు ఆయన అపాయింట్ మెంట్ సాధించి… ఐటీని ప్రజా పాలనలో వినియోగిద్దామని చెప్పిన తీరు గుర్తుకు వస్తోంది.

ఇప్పుడు ఓపెన్ ఏఐ అనేది ఏఐలో అత్యుత్తమ కంపెనీ వరల్డ్ లీడరే. ఆల్ట్ మన్ దానికి సారథిగా ఉన్నారు. అలాంటి ఆల్ట్ మన్ ను ఏపీకి ఆహ్వానిస్తూ.. చంద్రబాబు రిప్లై ఇచ్చిన తీరు నిజంగానే నాటి అనుభవాలను గుర్తు చేసిందని చెప్పాలి. ఒకవేళ ఆల్ట్ మన్ గనుక ,చంద్రబాబు రిప్లైకి సానుకూలంగా స్పందించి ఏపీకి వస్తే… ఏఐకి ఏపీ హబ్ గా మారిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు.