ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల జరగబోతున్నాయా ? మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అవుతున్న ప్రచారంచూస్తే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. క్యాబినెట్ సమావేశం నుండి ఉన్నతాధికారులు వెళిపోయిన తర్వాత జగన్ సహచర మంత్రులతో పిచ్చాపాటి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతు ఎన్నికల మూడ్ లోకి ఇప్పటినుండే షిఫ్ట్ అయిపోవాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి షెడ్యూల్ ఎన్నికలు 2024లో జరగాలి. అంటే షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. మరలాంటపుడు ఇప్పటినుండే ఎన్నికల మూడ్ లోకి పార్టీ నేతలు ఎందుకు షిఫ్టవ్వాలో అర్ధంకావటంలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటు అందరు ముందుకు సాగాలని చెప్పటం మామూలే. వచ్చే ఏడాదే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బృందం రంగంలోకి దిగుతుందని చెప్పారట.
ఎన్నికలు ఎప్పుడో మూడేళ్ళ తర్వాత జరుగుతుంటే వచ్చే ఏడాదిలోనే పీకే టీం రంగంలోకి దిగి ఏమి చేస్తుందో అర్ధంకావటంలేదు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా అందరు ఇప్పటి నుండే క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేయాలని జగన్ చెప్పారట. ఏ సీఎం అయినా మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు ప్రజా ప్రతినిధులందరినీ క్షేత్రస్ధాయిలోతిరుగుతు జనాలకు అందుబాటులోనే ఉండాలని చెప్పటం సహజమే కదా.
క్యాబినెట్ లో మంత్రులకు జగన్ చేసిన సూచనలు నిజమే అయితే ముందస్తు ఎన్నికలకు జగన్ రెడీ అవుతున్నట్లే అనుమానించాలి. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ఉంటే మంత్రులకు, ప్రజాప్రతినిధులకు జగన్ ఇలాంటి సూచనలు ఇచ్చే అవకాశాలు లేవు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎంఎల్ఏల్లో అత్యధికులు జగన్ బొమ్మ కారణంగానే గెలిచారన్నది వాస్తవం. ఎవరు పోటీచేస్తున్నారన్న విషయంతో సంబంధం లేకుండానే వైసీపీ తరపున పోటీచేస్తున్నారన్న ఒకే కారణంతో చాలా చోట్ల అభ్యర్ధులకు జనాలు ఓట్లేసేశారు.
కాబట్టి వచ్చే ఎన్నికల్లో అయినా సేమ్ సీన్ రిపీటవుతుందనటంలో సందేహమే లేదు. కాకపోతే క్షేత్రస్ధాయిలో కొందరు ఎంఎల్ఏలపై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవుతోందంటున్నారు. కాబట్టి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్ళల్లో కొందరిని మార్చే అవకాశం ఉంది. ఇలాంటి నియోజకవర్గాల్లో జగన్ పీకే టీం సేవలను తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలంటున్నారు. సో జగన్ మాటలను బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలే ఎక్కువున్నట్లు అనుమానంగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.