ఏపీలో అధికార వైసీపీకి చెందిన నేతల్లో ఇప్పుడు ఒక్కటే ఉత్కంఠ పెరిగిపోతోంది. దసరాకు కాస్త అటూ ఇటూగా మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని తెలియడంతో ప్రస్తుతం కేబినెట్లో ఉన్న వారిలో ఎవరు అవుట్ అవుతారు ? కొత్తగా ఎవరు ఇన్ అవుతారు ? అన్నదానిపై రకరకాల లెక్కల్లో ఎవరికి వారు మునిగి తేలుతున్నారు. జగన్ ముందు నుంచి ఒకే మాట మీద నిలబడతారు. ఆయన రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడు ఉన్న మంత్రి వర్గంలో 90 శాతం మందిని తప్పించేస్తానని చెప్పారు. సో ఈ లెక్కన దసరాకు తన కేబినెట్‌ను మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఎవరిని కేబినెట్ నుంచి తప్పించాలి ? ఎవరిని కొత్తగా కేబినెట్లోకి తీసుకోవాలనేదానిపై జగన్ రెండు నివేదికలు సైతం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది.
పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి సైతం కొన్ని ఈక్వేషన్లు ఇప్పటికే జగన్ ముందు ఉంచినట్టు చెపుతున్నారు. మరోవైపు కేబినెట్లో చోటు కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువుగా ఉండడంతో వీరంతా సజ్జల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జగన్ వీరికి అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్స్ లేకపోవడంతో సజ్జలనే వీరంతా నమ్ముకున్న పరిస్థితి. సామాజిక, కుల, ప్రాంత సమీకరణల ఆధారంగానే ఈ సారి కేబినెట్లో మార్పులు, చేర్పులు ఉంటాయంటున్నారు.
ఈ సారి కేబినెట్ రేసులో ఎక్కువ మంది ఎమ్మెల్సీ ఆశావాహులు కూడా ఉన్నారు. కమ్మ వర్గం నుంచి జగన్ హామీ ఇచ్చిన చిలకలూరిపేట ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ తో పాటు ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, మహ్మద్ ఇక్బాల్ పేర్లు ఉన్నాయి. జగన్ స్వయంగా హామీ ఇచ్చిన మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీని చేసి కాని మంత్రిని చేయడానికి వీల్లేదు. అయితే జగన్ శాసనమండలిని రద్దు చేస్తానని ఇప్పటికే చెప్పారు. పైగా ఆయన ఎమ్మెల్సీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి బోస్‌లను రాజ్యసభకు పంపారు. మరి అలాంటప్పుడు ఈ సారి ఎమ్మెల్సీలకు కేబినెట్లో ఛాన్స్ ఇస్తారా ? అన్న డౌట్ ఉంది.
ఇదిలా ఉంటే కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్న వారి సంఖ్యే 50 దాటేసింది. ఒక్క రెడ్డి సామాజిక వర్గం నుంచే ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. మరి వీరందరికి మంత్రి పదవులు రావడం కష్టం. జగన్ కన్ను వీరిలో ఎవరిమీద ఉందో ? చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates