రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవ్వరూ ఊహించలేరు. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న నేతలు.. రేపు శత్రువులు అయిపోతారు. నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు సాయంత్రానికే మిత్రులు అయిపోతారు. దశాబ్దాల రాజకీయ వైరం ఉన్నోళ్లు కూడా చిటుక్కున కలిసిపోతుంటారు. మరి కొందరు ఉదయం ఒక పార్టీలో ఉంటే..సాయంత్రం మరో పార్టీలో ఉంటారు. ఓ వైపు విజయవాడలో విపక్ష టీడీపీకి చెందిన నేతల మాటల తూటాలతో అక్కడ రాజకీయం ఎప్పుడూ వేడెక్కే ఉంటోంది. అయితే ఇప్పుడు వైసీపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది.
విజయవాడ వైసీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జగన్ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు దేవాదాయ మంత్రి పదవి ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గ్యాప్ నేపథ్యంలో మంత్రి హోదాలో వెల్లంపల్లి చేసిన సిఫార్సులను విష్ణు పక్కన పెట్టేయడం, విష్ణు ఇచ్చిన కాగితాలను మంత్రి ఆఫీస్‌లో చెత్త బుట్టలో వేయడం జరుగుతోందన్న టాక్ అయితే వచ్చింది.
ఇక కొద్ది రోజుల క్రితమే ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణును ప్రభుత్వం పక్కన పెట్టింది. అంతకు ముందు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మేయర్ పదవి మంత్రి ప్రాథినిత్యం వహిస్తోన్న పశ్చిమ నియోజకవర్గానికే వెళ్లింది. మిగిలిన పదవుల విషయంలోనూ తూర్పు నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఒక్కసారిగా విష్ణుకు ప్రాధాన్యత తగ్గడం వెనక కారణాలు ఏంటో ఎవ్వరికి అంతు పట్టడం లేదు. విష్ణు, వెల్లంపల్లి రెండోసారి ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిద్దరిది వేర్వేరు నేపథ్యం. ముందు నుంచే వీరికి గ్యాప్ ఉంది. విష్ణు ఫస్ట్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయితే, వెల్లంపల్లి ప్రజారాజ్యం నుంచి గెలిచారు. తర్వాత ఇద్దరూ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా గ్యాప్ ఉంది. తర్వాత వెల్లంపల్లి బీజేపీలోకి వెళ్లి తర్వాత వైసీపీలోకి వచ్చారు.
వాస్తవానికి బ్రాహ్మణ కోటాలోనే మల్లాదికి మంత్రి పదవి వస్తుందనుకున్నా జిల్లా సమీకరణలు ఆయనకు ఆ పదవిని దక్కకుండా చేశాయి. మల్లాది బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా దేవాదాయ శాఖతో ముడిపడి ఉండడం, ఇద్దరూ బెజవాడ నగర నేతలే కావడంతో పాత గ్యాప్ మరింత పెరిగేలా కారణమైంది. ఈ వార్‌లో వెల్లంపల్లి చాలా జాగ్రత్తగా కథ నడపడంతో పాటు వైసీపీ కీలక సలహాదారును గుప్పెట్లో పెట్టుకోవడంతో మల్లాది పదవి పీకేశారని తెలుస్తోంది. ఈ పరిణామంతో వెల్లంపల్లి వర్గంలో ఫుల్ జోష్ నెలకొంది. అయితే మల్లాది వర్గం మాత్రం త్వరలోనే వెల్లంపల్లి పదవి పీకేస్తారని.. తమ నేతకు మంత్రి పదవి వస్తుందని.. అందుకే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తప్పించారని అంటున్నారు.