బొత్స కుర్చీకి ఢోకా లేదా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార వైసీపీలో జోరుగా సాగుతోన్న చ‌ర్చ ఒక‌టే.. అదే కొత్త‌గా ఏర్పాటు చేసే మంత్రివ‌ర్గంలో ఎవ‌రుంటారు? ఎవ‌రిపై వేటు ప‌డుతుంది? కొత్త‌గా ఎవ‌రికి అవ‌కాశం ద‌క్కుతుంది? అని. రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయ‌ని 2019 లో అధికారం చేప‌ట్టిన‌పుడే సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడా స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆ పార్టీ నాయ‌కుల్లో టెన్ష‌న్ పెరిగిపోతోంది. మంత్రులుగా ఉన్న వాళ్లు త‌మ ప‌ద‌వి ఉంటుందో లేదా ఊడుతుందో అని.. మంత్రి ప‌ద‌వి కోసం ఆశ‌గా ఎదురుచూస్తున్న వాళ్లు ఈ సారైనా ద‌క్కుతుందో లేదో అని టెన్ష‌న్ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఒక మంత్రికి మాత్రం ఇలాంటి బాధ లేద‌ని ఆయ‌న ప‌ద‌వికి వ‌చ్చిన గండ‌మేమీ లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌నే బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఈ నేత‌ది సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వం. తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో గొప్ప ప‌లుకుబ‌డి ఉంది. ఆయ‌న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నే పేరు కూడా ఉంది. సీనియ‌ర్ నేత‌గా ఆయ‌న‌కున్న అనుభ‌వం ప్రాంతం త‌దిత‌ర నేప‌థ్యాలు క‌లిసి జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో బొత్స అయిదేళ్ల పాటు కొన‌సాగ‌డం ఖాయ‌మనే అంచ‌నాలున్నాయి. జ‌గ‌న్ ఎలాంటి స‌మీక‌ర‌ణ‌లు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నా బొత్స‌ను మాత్రం మార్చ‌ర‌నే ప్ర‌చారం సాగుతోంది.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చూస్తే బొత్త మంత్రి ప‌ద‌వికి పోటీగా వైసీపీ ఎమ్మెల్యే కోల‌గట్ల వీర‌భ‌ద్ర‌స్వామి ఉన్నారు. ఆయ‌న మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో ఉన్నారు. వైసీపీలో మొద‌ట చేరింది ఆయ‌నే. పైగా మూడు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం కూడా ఉంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ఆర్ ఆ త‌ర్వాత ఆయ‌న కొడుకు జ‌గ‌న్‌కు ఎంతో ఇష్ట‌మైన నేత‌గా వీర‌భ‌ద్ర స్వామి కొన‌సాగుతున్నారు. కానీ రాజ‌కీయంగా మాత్రం అనుకున్న స్థానానికి చేర‌లేక‌పోయార‌నే టాక్ ఉంది. ఈ సారి కూడా మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోతే ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ ముగిసిన‌ట్లేన‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

అయితే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ద‌ని జ‌గ‌న్ చూచాయ‌గా చెప్పార‌ని తెలుస్తోంది. ఆయ‌న కుమార్తె శ్రావ‌ణిని విజ‌య‌న‌గ‌రం కార్పోరేష‌న్ డిప్యూటీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఇటీవ‌ల నియ‌మించ‌డం ద్వారా ఆ కుటుంబానికి న్యాయం చేసిన‌ట్లేన‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని తెలిసింది. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో వీర‌భ‌ద్ర స్వామికి చోటు ద‌క్క‌ద‌ని చెప్ప‌డానికే ఇలా చేశార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో బొత్స‌కు ఎదురులేకుండా పోయింది. 2024 ఎన్నిక‌ల్లో గెలిచి అధికారం నిల‌బెట్టుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్‌కు బొత్స లాంటి నాయ‌కుడి అవ‌స‌రం ఉంది. ఉత్త‌రాంధ్రాలో మ‌రోసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటేనే అధికారం ద‌క్క‌తుంది. అంతే కాకుండా విశాఖ‌ను రాజ‌ధాని చేయాల‌ని అనుకుంటున్న జ‌గ‌న్‌కు బొత్స లాంటి నేత చేదోడువాదోడుగా ఉండ‌డం అవ‌స‌ర‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇలా అన్ని ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే బొత్స కుర్చీకి ఇప్పుడు వ‌చ్చిన ముంపేమీ లేద‌ని నిపుణులు అంటున్నారు.