తెలంగాణలో తొలిసారి అత్యధిక కేసులు.. ఎందుకిలా?

ప్రపంచానికి షాకిస్తున్న మాయదారి మహమ్మారి వేగంగా కమ్మేస్తోంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య పరిమితంగా ఉండటమే కాదు.. నియంత్రించే స్థాయిలో ఉందన్న మాట వినిపించేది. దీనికి తగ్గట్లే రోజువారీ కేసుల నమోదు కూడా తక్కువగానే ఉండేవి. అందుకు భిన్నంగా శుక్రవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైన విషయాన్ని ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేనట్లుగా ఒక్కరోజులో తెలంగాణలో 169 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 82 కేసులు నమోదు కావటం గమనార్హం. ఒకే రోజులో అత్యధిక కేసుల నమోదులో ఈ రెండు రికార్డులేనని చెబుతున్నారు. మొన్నటివరకూ తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాల్లో పాజిటివ్ కేసులే నమోదు కానీ తీరుకు భిన్నంగా ఇప్పుడు ఒకటి అరా కేసులు వస్తుండటం గమనార్హం. ఇంతకీ ఇంత భారీగా కేసులు ఎందుకు నమోదైనట్లు? దానికి కారణం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండగా.. సౌదీ నుంచి వచ్చిన 64 మందికి కూడా పాజిటివ్ రావటం కొత్త తలనొప్పిగా మారింది. సరైన వీసాలు లేకుండా సౌదీలో దొరికిపోయిన పలువురిని ఆ దేశం వెనక్కి పంపేసింది. ఇలా పంపిన వారిలో ఎక్కువమంది పాజిటివ్ కేసులు కావటం ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది.

అంతేకాదు.. ఇతరరాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులతోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కేసులు రాగా.. రంగారెడ్డిలో 14 కేసులు.. మెదక్ లో రెండు.. సంగారెడ్డి జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. ఖమ్మం జిల్లాలోనూ రెండు కేసులు నమోదు కావటం చూస్తే.. మొన్నటివరకూ నియంత్రణలో ఉన్న పరిస్థితి ఇప్పుడు కట్టు తప్పుతోందా? అన్నది ప్రశ్నగా మారింది.

గడిచిన మూడు రోజుల్నే తీసుకుంటే కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. మే 27నుంచి వరుస పెట్టి నమోదవుతున్న పాజిటివ్ కేసులు వందకు తగ్గకపోవటం ఒక విశేషంగా చెప్పాలి. అంతేకాదు.. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. గతంలో ఒకటి అరా అన్నట్లు ఉండే మరణాలు.. ఇటీవల కాలంలో ప్రతి రోజు మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.

ఇంతకీ.. ఇలాంటిపరిస్థితి కారణం ఏమిటన్నది చూస్తే.. లాక్ డౌన్ సడలించటం.. ప్రయాణాలు పెరగటం.. మొన్నటివరకూ జాగ్రత్తగా ఇంటికే పరిమితమైన వారు.. ఇప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి రావటం కూడా కేసుల నమోదు ఎక్కువ కావటానికి కారణంగా చెబుతున్నారు.