హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పట్లో ఉప ఎన్నిక జరగదని తేలిపోయింది. అయినా కేసీయార్ తన వ్యూహాలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేదు. మంత్రులను నియోజకవర్గంలోనే మోహరించారు. వారంతా తమకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా చేసుకుంటూ పోతున్నారు. హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ రెగ్యులర్ గా నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. వీళ్ళ పర్యటనల్లో పైకి డెవలప్మెంట్ కార్యక్రమాల పర్యవేక్షణ అని కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం మరో ఎజెండా ఉంది.
అదేమిటంటే ఈటల రాజేందర్ ను నియోజకవర్గంలో ఒంటరిని చేయడం. ఒంటరి అంటే మామూలుగా కాదు సామాజిక వర్గాల వారీగా ఏ వైపు నుంచి కూడా ఈటలకు సహకారం అందకుండా చేయాలని కేసీయార్ గట్టి ప్లాన్ చేస్తున్నారు. మొదటగా ఒకపుడు ఈటలకు మద్దతుదారులుగా నిలిచిన వారిని తమవైపు తిప్పుకోవటంతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈటలతో పాటు బీజేపీలో చేరిన బలమైన మద్దతుదారులను తిరిగి టీఆర్ఎస్ లో చేరేట్లు చేయటంలో సక్సెస్ అయ్యారు.
మత్స్య పారిశ్రామిక సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన పోలు లక్ష్మణ్ ఈటలకు ప్రధాన మద్దతుదారుడు. ఈయన ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది తాజాగా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరడం చాలా కీలకమనే చెప్పాలి. జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వైఎస్ చైర్మన్ పింగిలి రమేష్ తన మద్దతుదారులతో తిరిగి అధికార పార్టీలో చేరారు. వీరిద్దరు ఈటెలతో పాటు టీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీలో చేరిపోయారు. మొన్నటి వరకు ఈటలతోనే ఆయన విజయానికి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు టీఆర్ఎస్ లో చేరటం ఈటలకు దెబ్బనే చెప్పాలి.
ఇప్పటికే అంటే వారం క్రితమే వీణవంక మండలం ఎంపీటీసీ, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రావిశెట్టి లలితా శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారు. వీరంతా బీసీల్లో కీలకమైన ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఈటల కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికే చెందిన నేతగా అందరికీ పరిచితుడే. ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీపరంగానే కాకుండా సామాజిక వర్గం పరంగా కూడా ఈటలను ఒంటరిని చేయడమే కేసీయార్ వ్యూహంగా కనబడుతోంది.
ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందో తెలీకపోయినా ఈటలను గట్టి దెబ్బ తీసేందుకు కేసీయార్ అలుపెరగకుండా పనిచేస్తునే ఉన్నారు. అలాటిది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంకేమైనా ఉందా ? చివరకు నామినేషన్ వేసేందుకు కూడా ఒకటికి రెండుసార్లు గెలుపుపై ఆలోచించే స్ధాయికి ఈటెలను నెట్టేయాలన్నది కేసీయార్ వ్యూహం. మరి కేసీయార్ వ్యూహాలు ఇలాగుంటే దీనికి విరుగుడుగా ఈటల ఏమి వ్యూహాలు పన్నేతారా అనే ఆసక్తి పెరిగిపోతోంది. మొత్తం మీద హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం పెద్ద సంచలనమే సృష్టించటం మాత్రం ఖాయమని అర్ధమైపోతోంది. చూద్దాం ఇంకెన్ని సంచలనాలుంటాయో.
Gulte Telugu Telugu Political and Movie News Updates