జగన్ హవా ముందు తేలిపోయిన తెలుగు దేశం పార్టీ ఏపీలో గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫ్యాన్ గాలిని తట్టుకుని నిలబడ్డ కొంతమంది టీడీపీ నేతులు ఊహించిన స్థానియలో ఆక్టివ్గా ఉండకుండా మౌనం పాటించడం ఆ పార్టీని కలవరపెడుతూ వచ్చింది. కానీ ఇటీవల ఆ పార్టీ నాయకులు తిరిగి జోరు అందుకోవడంతో టీడీపీలో జోష్ వచ్చిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతలైన బాబాయ్ అచ్చెన్నాయుడు, అబ్బాయ్ రామ్మోహన్ నాయుడు తిరిగి తమ గళాన్ని పెంచడం రాష్ట్ర టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు అనుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. జగన్ ధాటి ముందు ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుపోయాయి. టీడీపీ తరుపున మాత్రం కొంతమంది నాయకులు ఎన్నికల్లో విజయాలు సాధించారు. అందులో ముఖ్యంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడు తమ స్థానాల్లో గెలిచారు. టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు జయకేతనం ఎగురవేశారు. కానీ పార్టీ అధికారం కోల్పోవడం వీళ్లపై ప్రభావం చూపింది. మరోవైపు ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ కావడం దెబ్బతీసింది. దీంతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించాల్సిన ఆయన కేసులకు భయపడి మౌనంగా ఉండిపోయారనే టాక్ వినిపించింది.
కానీ ఆ సమయంలోనూ పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆయన ధైర్యం నింపుతూ వచ్చారు. సమయం కలిసొచ్చేంత వరకూ ఓపికగా ఉండాలని సూచనలు చేశారని తెలిసింది. దూకుడుగా ఉండాల్సిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఇలా మౌనం పాటించడంతో కార్యకర్తలు ఆందోళన చెందారు. మరోవైపు బాబాయ్ అరెస్టుతో ఎంపీ రామ్మోహన్ కూడా మొదట్లో సైలెంటైపోయారని సమాచారం. దీంతో కీలక స్థానాల్లో ఉన్న వీళ్లు ఇలా మౌనం వహించడం కార్యకర్తల్లో అనుమానాలు పెంచింది. కానీ ఇటీవల తమ మాటల్లో వేగాన్ని పెంచిన ఈ ఇద్దరు మునుపటి జోరు ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల డీజీల్, పెట్రోలోతో పాటు నిత్యవసర ధరల పెరుగుదలకు నిరసనగా కోటబొమ్మాళిలో వీళ్లు తమ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెబుతూ అధికార వైసీపీపై విమర్శలు చేయడంతో ఈ ఇద్దరిలో వచ్చిన ఈ మార్పు రాజకీయ వర్గాల్లో చర్యకు దారితీసింది. టెక్కలిలో కొందరు వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని అధికార ప్రభుత్వ అండతో కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ అధికారంలోకి వచ్చాక వాళ్లను ఎవరూ కాపాడలేరని ఈ బాబాయ్ అబ్బాయ్ హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసులపైనా కన్నేశామని వెల్లడించారు. మొత్తానికి కేసులంటే భయం పోయిందో లేదా నిశ్శబ్దంగా ఉంటే కనుమరుగైపోతామనుకున్నారో ఏమో తెలీదు కానీ అచ్చెన్నాయుడు రామ్మోహన్నాయుడుల్లో వచ్చిన మార్పు పార్టీకి ఆనందాన్ని కలిగించేదే. మరి వచ్చే ఎన్నికల వరకూ వీళ్లిద్దరూ ఇదే దూకుడు కొనసాగిస్తారోమో చూడాలి.