ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలెట్టిన మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను తిరిగి ఆక్టివ్ చేసే పనిలో పడ్డ ఆయన.. ఆ మేరకు ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారు. అందులో భాగంగానే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా దేవగుడి భూషేష్‌రెడ్డిని బాబు నియమించారు. కడప టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జమ్మలమడుగులో రాజకీయ పరిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి బీజేపీలో, పి.రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంతో అక్కడ పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. దీంతో వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీకి జమ్మలమడుగులో దిక్కెవరూ అనుకుంటున్న తరుణంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరినప్పటికీ ఆయన అన్న నారాయణరెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగారు. దీంతో ఇప్పుడు నారాయణరెడ్డి కొడుకు భూపేస్‌రెడ్డికి నియోజవకర్గ ఇంఛార్జ్ బాధ్యతలను బాబు అప్పజెప్పారు.
జమ్మలమడుగులో తాము పోటీ చేస్తామని కొంతకాలంగా నారాయణరెడ్డి చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొడుక్కు బాబు బాధ్యతలు కట్టబెట్టడం వ్యూహాత్మకమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తమ వర్గం చెల్లాచెదురు కాకుండా ఉండేందుకు టీడీపీలో అన్న కుటుంబం కొనసాగేందుకు ఆదినారాయణ రెడ్డి తెరవెనక ఉండి చక్రం తిప్పారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల నాటిని జమ్మలమడుగులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంచనాలు నెలకొన్నాయి. ఆదినారాయాణ లేదంటే భూపేష్‌లో ఎవరో ఒకరు మాత్రమే అప్పటికి పోటీలో ఉంటారని ఆ నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. మరి ఈ రాజకీయ పరిణామాలు ఏ విధమైన మలుపు తీసుకుంటాయో తేలాలంటే 2023 వరకూ ఆగాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates