హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కేసీఆర్.. అక్కడ అధికంగానే ఉన్న దళితుల ఓట్లను పొందడానికి దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆ నియోజకవర్గంలోనే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
దళిత బంధు లాంటి పథకం దేశంలో లేదని.. ఎన్నికల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించామని టీఆర్ఎస్ నాయకులు ఎంత మొత్తుకున్నా.. ఆ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎందుకు ప్రవేశ పెట్టారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓడితే తనకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో అవతరించాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీలకు ఛాన్స్ దొరికనట్లవుతుంది.
కేసీఆర్ ఇప్పటివరకూ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీల అమలుకు నోచుకోలేని కేసీఆర్ ఇప్పుడు దళితులకు కొత్తగా ఏం చేస్తారంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా దళిత బంధు పథకం కేవలం హుజూరాబాద్‌కే పరిమితమవుతుందా? లేదా కేసీఆర్ అన్నట్లు రాష్ట్రంలోని దళిత ప్రజలందరికీ ఈ పథక ఫలాలు దక్కతాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆ ఎన్నిక ముగియగానే ఇక ఈ పథకం గురించి పట్టించుకోరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడే రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆలస్యమవుతోంది కాబట్టి ప్రజల్లో ఇలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు కేసీఆర్ మరో నాలుగు నిజయోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళిత బంధు అందిస్తామని తాజాగా ప్రకటించారు.
అయితే హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ను గెలిపించకపోతే రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలు ప్రశ్నార్థకమే అవుతుందనే రీతిలో ఓటర్లకు కేసీఆర్ పరోక్షంగా హింట్ ఇచ్చారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గెలుపు దక్కితేనే ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తామని చెప్పకనే చెప్పినట్లు ఉందనే టాక్ బయట వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అందించిన రూ.10 వేల వరద సాయం లాగే ఈ దళిత బంధు పథకం కూడా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హుజూరాబాద్‌లో గెలిచినా లేదా ఓడినా రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేసేందుకు ప్రభుత్వం సమయం తీసుకునే వీలుందని అధ్యయనం పేరుతో వచ్చే ఎన్నికలకు ముందు వరకూ ఈ కథ నడిపిస్తారని మరో వర్గం రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేస్తామని ప్రజలను నమ్మించి తిరిగి అధికారం దక్కించుకునేలా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates