ఇప్పుడు.. ఈ ప్రశ్న మేధావులను కూడా తికమక పెడుతోంది. కరడు గట్టిన వైసీపీ అభిమానులను కూడా కలచి వేస్తోంది. ఎందుకంటే.. ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన అనేక హామీల్లో ఒకటి అత్యంత క్లిష్ట మైన హామీ. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకోవడం అనేది జగన్‌కు కత్తిమీద సాముగా మారింది. అయితే.. అమలు చేయకపోతే.. వచ్చె ఎన్నికల్లో ఈ హామీ పెద్ద మైనస్‌గా మారిపోవడం ఖాయం. దీంతో ఇప్పుడు జగన్ మడమ ఎటుతిరుగుతుంది ? అనే ట్యాగ్‌తో టీడీపీ ఆట పట్టిస్తోంది. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. ఏపీలో అధికారం చేపట్టేందుకు.. జగన్ పాదయాత్ర చేశారు.
ఈ సమయంలో ప్రజల కష్టాలు తెలుసుకున్న ఆయన.. వెంటనే.. కొన్ని హామీలు ఇచ్చారు. వీటిలో అత్యంత కీలకమైన.. మద్య నిషేధం ఒకటి. దీనిని విడతల వారీగా ఆయన అమలు చేస్తానని అన్నారు. అంతేకాదు.. ధరలు పెంచుతానని చెప్పారు. వీటిలో తొలి ఏడాది పాలన సమయంలో.. నిజంగానే షాపుల సంఖ్య తగ్గించారు. దీంతో ఇంకేముంది.. జగన్ అన్నమాట నిలబెట్టుకుంటున్నారనే వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక, వైసీపీ నాయకులు జగన్‌కు పాలాభిషేకాలు చేశారు. కానీ, అనూహ్యంగా రెండో ఏడాది పాలన వచ్చే సరికి.. కరోనా ఎఫెక్ట్‌తో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది.
దీంతో మద్యం తప్ప మరోమార్గం ప్రభుత్వానికి లేకుండా పోయింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్యం పై వచ్చే ఆదాయాన్ని నికర వనరుగా భావిస్తుందని. ఆర్థిక వేత్తలు చెబుతారు. అన్ని రాష్ట్రాలూ.. ఒక్క గుజరాత్ తప్ప.. మద్యంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. గోవా అయితే.. ప్రధాన ఆదాయ వనరు మద్యం, టూరిజంపైనే ఆధారపడింది. అలాంటిది .. ఏపీలో మద్య నిషేధం మాట.. నిజంగానే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచి పోయింది. ఆర్థిక సమస్యలు అల్లాడిస్తున్నాయి.
మరో రెండున్నరేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ నేపథ్యంలో కీలకమైన మద్య నిషేధం అమలు చేయకపోతే.. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి జగన్‌ను బద్నాం చేయడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో జగన్ సర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? అనే ఆలోచన ఉన్నా.. ఇప్పటికిప్పుడు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే.. ఆదాయ వనరుగా ఉన్న మద్యం తప్ప.. మరో మార్గం లేదు. సో.. ఈ విషయంలో పాదం ఎటు తిప్పాలి? అనేది వైసీపీలో తర్జన భర్జనకు గురి చేస్తున్న ప్రధాన అంశంగా మారడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates