తాలిబాన్ల కిరాతకం.. శవాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి…!

ఆప్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇలా అమెరికా రక్షణ దళం.. ఆప్ఘానిస్తాన్ ని వదిలేసి వెళ్లిందో లేదో.. ఇలా తాలిబాన్లు తమ అరాచకాలను రెట్టింపు చేయడం గమనార్హం.

అమెరికా సైన్యం వదిలేసి వెళ్లిన ఆయుధాలు, హెలికాప్టర్లతో చక్కర్లు కొడుతూ తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వేటాడుతున్నారు. తాజాగా ఓ మృతదేహాన్ని హెలికాప్టర్ కు వేలాడదీసి తీసుకెళ్లారు తాలిబన్లు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తొలుత ఆ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపిన తాలిబన్లు ఆపై అమెరికా మిలటరీ హెలికాప్టర్‌కు ఆ మృతదేహాన్ని తాడుతో కట్టి కాందహార్ మొత్తం చక్కర్లు కొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోల్లో హెలికాప్టర్‌కు తాడుతో వేలాడుతున్న వ్యక్తి సజీవంగా ఉన్నాడా? లేక అది మృతదేహమా? అన్ని స్పష్టంగా కనిపించడం లేదు. అయితే, చంపేసిన వ్యక్తినే తాలిబన్లు ఇలా వేలాడదీస్తూ హెలికాప్టర్‌లో ప్రదర్శన ఇచ్చారని చెబుతున్నారు.

తాలిబన్లది చెబుతున్న తాలిబ్ టైమ్స్ ట్విట్టర్ ఖాతా మాత్రం.. తమ ఎయిర్ ఎయిర్ ఫోర్స్.. ప్రస్తుతం ఇస్లామిక్ ఎమిరేట్స్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు కాందహార్ నగరం మీదుగా పెట్రోలింగ్ చేస్తున్నట్టు పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా గత నెలలోనే 7 బ్లాక్ హాక్ చాపర్లను అందించింది. ఇప్పటికే ఆఫ్ఘనిస్థాన్‌కు అందించిన వాటికి ఇవి అదనం. ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాలు గత రాత్రి పూర్తిగా వైదొలగడానికి ముందు 73 విమానాలు, 27 హమ్వీస్, ఆయుధ సంపత్తి, ఇతర హైటెక్ డిఫెన్స్ పరికరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంది.