ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో సీనియర్లు.. చాలా మంది ఉన్నారు. నిజానికి సీనియర్లు అంటే.. పార్టీని డెవ లప్ చేయడంతోపాటు.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని గెలుపు దిశగా నడిపించాల్సిన బాధ్యతను భుజాల పై వేసుకుంటారని అర్ధం. కానీ, టీడీపీలో ఉన్న సీనియర్లు.. ఇప్పటికీ.. చంద్రబాబు మొప్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన దృష్టిలో మంచి మార్కులు పొందేందుకు తహతహలాడుతున్నారు. లేదా.. తమ కోరికలు నెరవేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలపై పార్టీలో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నారు.
సీనియర్లను గమనిస్తే.. విజయనగరం జిల్లా నుంచి కడప వరకు పదుల సంఖ్యలోనే ఉన్నారు. వీరంతా గతంలో మంత్రులుగా చక్రాలు కూడా తిప్పారు. పార్టీలోనూ.. టాప్ 10లో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇక, తమ వారసులకు అవకాశం ఇప్పించుకున్నవారు కూడా కనిపిస్తారు. కానీ, ఎవరూ కూడా పార్టీ కోసం మనసు పెట్టి పనిచేయడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఉదాహరణకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును తీసుకుంటే.. ఆయన గడిచిన రెండున్నరేళ్ల కాలంలో పార్టీ పురోగతికి ఇటు పుల్ల తీసి అటు వేసింది లేదు. కేవలం తనకు ఏదైనా సమస్య వస్తే.. వెంటనే మీడియా ముందుకు వస్తున్నారు. లేకుంటే.. మాత్రం సైలెంట్.
ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుది కూడా ఇదే తంతు. రెండున్నరేళ్ల కాలంలో చంద్రబాబు అయినా.. రోడ్డెక్కి ధర్నాలు చేశారు కానీ, యనమల మాత్రం గడప దాటింది లేదు. పైగా.. ఆర్థిక సమస్యలపైనా.. జగన్ ప్రభుత్వ ఆర్థిక విషయాలపై మీడియా బైట్లకే ఆయన సమయం కేటాయిస్తున్నారు తప్ప.. క్షేత్రస్థాయిలో పార్టీని పట్టించుకుని.. నేతలను నడిపిస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదీ ఇదే పరిస్థితి. కేవలం.. క్షేత్రస్థాయిలో సమస్యలపై పోరాటం చేస్తున్నారే తప్ప.. పార్టీ మనుగడకు ఉపయోగపడే రాష్ట్ర స్థాయి పోరాటాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.
ఇక, కొందరు మాజీ మంత్రులు దూకుడుగా ఉందని అనుకున్నా.. పార్టీ అధిష్టానమే వీరిని పక్కన పెట్టింది . దీంతో .. వీరంతా ఇప్పుడు డమ్మీ నాయకులుగా మారిపోయారు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. దీంతో సీనియర్లు కేవలం.. మీడియా ప్రకటనలకే సరా? అంటూ.. నెటిజన్లు రుసరుసలాడుతుండడం గమనార్హం. అదే సమయంలో పార్టీ అభిమానులు కూడా ఈ పరిణామంపై విస్తు పోతున్నారు. మరి చంద్రబాబుకు ఇవి తెలియవని అనుకోవాలా? లేక.. తెలిసి కూడా మౌనం పాటిస్తున్నారని భావించాలా? అనేది చర్చకు దారితీస్తోంది.