ఒకప్పటితో పోలిస్తే గత పదేళ్లలో ఇండియాలో ఉగ్రవాద దాడులు బాగా తగ్గాయి. ముఖ్యంగా 2014లో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక సామాన్య జనాలపై ఉగ్రవాద దాడులు దాదాపు లేవనే చెప్పాలి. ఐతే గత ఏఢాది మాత్రం పుల్వామాలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఒకేసారి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు.
దానికి ప్రతిగా భారత సైన్యం దీటుగా స్పందించింది. ఉగ్రవాదుల మీద భీకర దాడులు చేపట్టింది. సర్జికల్ స్ట్రైక్స్, ఇతర దాడుల ద్వారా వందల మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. దీంతో మళ్లీ దెబ్బకు దెబ్బ తీయాలని చూస్తున్న ఉగ్రవాదులు ఇండియాలో దాడుల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
లాక్ డౌన్ ఆరంభమైన మొదట్లో నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి వచ్చి పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ఉగ్రదవాలు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది.
తాజాగా పుల్వామా తరహాలో జవాన్లను లక్ష్యంగా చేసుకుని భారీ పేలుడుకు ఉగ్రవాదులు వేసిన ప్రణాళికను భారత సైన్యం విచ్ఛిన్నం చేసింది. ఇది జరిగింది కూడా పుల్వామాలోనే కావడం గమనార్హం.
బాంబు అమర్చిన ఓ కారులో ఉగ్రవాది సంచరిస్తున్నట్లు పుల్వామా పోలీసులకు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది బృందాలుగా ఏర్పడి తనిఖీలు మొదలుపెట్టారు. బుధవారం రాత్రి ఒకచోట ఆ వాహనం కోసం కాపుకాచారు.
చీకటి పడిన సమయంలో అనుమానిత వాహనం అక్కడకు చేరింది. దీంతో వెంటనే బలగాలు దానిపై కాల్పులు జరిపాయి.వాహనంలో ఉన్న వ్యక్తి పారిపోయాడు. అయితే వాహనం వెనుక భారీ డ్రమ్ములో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తించారు.
బాంబు స్క్వాడ్ వచ్చి కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయని.. వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తే పేలే ప్రమాదముందని చెప్పారు. దీంతో సమీప ప్రాంతంలో అందరినీ ఖాళీ చేయించిన భద్రత దళాలు కారును పేల్చేశాయి. ఈ పేలుడు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.