హుజూరాబాద్ దెబ్బ కేసీఆర్ మీద బాగా పడిందా ?

తొందరలో జరగబోయే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక దెబ్బకు కేసీఆర్ జనాల్లో తిరగాల్సొస్తోంది. మామూలుగా అయితే నెలల తరబడి సీఎం అసలు జనాల మొహమే చూడరు. కొన్ని నెలలపాటు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అనుమానం లేకుండా కేసీయార్ పేరే చెబుతారు. మంత్రులకు, ఉన్నతాధికారులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వరనే ప్రచారానికి కొదవేలేదు.

ఎంతోమంది మంత్రులు, ఉన్నతాధికారులు ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్ళి కేసీఆర్ తో మాట్లాడకుండానే వెనక్కు తిరిగివచ్చేశారట. దీనికి కారణం ఏమిటయ్యా అంటే సీఎం ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడకపోవటమే. మంత్రులతో ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడకుండా ఉంటే ఎలా అనే ప్రశ్న ఎవరు అడగకూడదు. అయినా కేసీయార్ కు హాయిగా అలా జరిగిపోతోందంతే. జనజీవన స్రవంతికి దూరంగా ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉంటున్న కేసీయార్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక పెద్ద సమస్యగా మారింది.

ఉప ఎన్నిక దెబ్బకు కేసీఆర్ ఇప్పటికే మూడు సార్లు బహిరంగ సభల్లో ప్రసంగించాల్సి వచ్చింది. తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. దళిత బంధు పథకాన్ని ప్రారంభించేందుకు కేసీయార్ వాసాలమర్రి సభలో పాల్గొన్నారు. తర్వాత హుజూరాబాద్ లో కూడా మరో సభలో పాల్గొన్నారు. మధ్యలో కూడా బహిరంగ సభలో పాల్గొన్నారు.

ఇది కాకుండా పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి లాంటి కీలక నేతలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని పార్టీ ఆఫీసులో కూడా నేతలతో సమావేశమయ్యారు. అంతగా కేసీయార్ ఎందుకు కష్టపడుతున్నారంటే, జానల్లో పదే పదే ఎందుకు తిరుగుతున్నారంటే కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలవాలని మాత్రమే. తన సహజ శైలికి విరుద్ధంగా వెంటవెంటనే బహిరంగ సభల్లో పాల్గొనడం, పార్టీ నేతలతో సమావేశాలు పెట్టడంతోనే కేసీయార్లోని ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తానికి హుజూరాబాద్ దెబ్బకు ఎప్పుడు లేనట్లు కేసీయార్ పదే పదే జనాల్లో కనబడుతున్నారు.