ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా జగన్ పాలన గురించి ఇంతవరకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పెద్దగా ఎక్కడా కామెంట్లు చేయలేదు. చేసినా అవి మామూలు స్పందనలే. అయితే మొదటి సారి బాలకృష్ణ జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అరాచక పాలన ఐదేళ్లుండదన్నారు. త్వరలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారని బాలయ్య అన్నారు.
బాలృష్ణ వ్యాఖ్యలు వేగంగా వైరల్ అయ్యాయి. మహానాడులో జూమ్ ద్వారా పాల్గొన్న నందమూరి బాలకృష్ణ తన సందేశం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇది ఐదేళ్లు ఉండదని, త్వరలో ఎన్నికలు జరుగుతాయని బాలయ్య అన్నారు. పలు సంఘటనల్లో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు.
ఇక పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపే మాటలు చెప్పారు బాలకృష్ణ. ఎన్టీఆర్ వారసులు తాము కాదని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఎన్టీఆర్ వారసులు అని, వారే పార్టీని నిలబెడుతోందని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. పార్టీ కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్త కోసం తన జీవితం అంకితం చేస్తానని అన్నారు.
ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఈరోజు ప్రతి తెలుగు వాడికి పండగ రోజన్నారు. ఆయన వల్లే మద్రాసీలుగా పిలువబడుతున్న తెలుగు జాతికి సొంత గుర్తింపు తెచ్చి తెలుగు వాడి ఆత్మగౌరవం నిలబడిందారు. భూమి మీద ఎంతో మంది పుడతారు గాని అందరూ మహానుభావులు కాలేరు. ఎన్టీఆర్ అలాంటి అరుదైన వ్యక్తి అన్నారు.