ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కొన్నేళ్ల కిందట రాజకీయాల్లోకి తుపాను లాగా వచ్చాడు. 2019 ఎన్నికల ముంగిట బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరడం.. కొన్ని నెలల పాటు హడావుడి చేయడం తెలిసిందే. ఆయన దూకుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కూడా దక్కించుకుంటాడని.. ఎన్నికల్లో పోట ీచేసి గెలుస్తాడని అనుకున్నారు చాలామంది.
కానీ బండ్లకు టికెట్ దక్కలేదు. ఎన్నికల్లో పోటీనే చేయలేదు. అయినా కూడా ఉత్సాహం కోల్పోకుండా పార్టీ తరఫున ప్రచారం చేశారు. కాంగ్రెస్‌దే అధికారం అని బల్లగుద్ది చెప్పారు. అలా జరక్కుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ సవాళ్లు కూడా చేశారు. కానీ ఆయన అంచనాలు తల్లకిందులయ్యాయి. మరోసారి టీఆర్ఎస్సే అధికారంలోకి వచ్చింది. దీంతో బండ్ల రాజకీయాలకు టాటా చెప్పేశాడు. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని.. ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటానని బండ్ల ప్రకటించాడు.
ఐతే ఇప్పుడు బండ్ల తీరు చూస్తుంటే మున్ముందు మళ్లీ రాజకీయాల్లో అడుగు పెడతాడేమో అనిపిస్తోంది. గణేష్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాని ప్రోమోలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజయ్యాయి. ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉన్న ఈ ప్రోమోల్లో రాజకీయాల గురించి పెద్ద చర్చే నడిచింది. తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి బండ్ల చాలానే మాట్లాడాడు.
కొత్తగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి మీద ప్రశంసలు కురిపించాడు. ఆయన్ని మించిన ఆకర్షణ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఎవరికీ లేదని తేల్చేశాడు. అధికార పార్టీ టీఆర్ఎస్లో కేసీఆర్ మాత్రమే బాగా పని చేస్తున్నారని.. మిగతా వాళ్లు విఫలమవుతున్నారని వ్యాఖ్యానించాడు. రాజకీయాల్లో పున:ప్రవేశం గురించి అడిగితే ముందు నిరాసక్తత వ్యక్తం చేసిన బండ్ల.. సినీ రంగంలో ‘తీన్ మార్’ ఫ్లాపయ్యాక ‘గబ్బర్ సింగ్’ తీసి హిట్ కొట్టారు కదా.. రాజకీయాల్లో మాత్రం ఫెయిల్యూర్ రాగానే వెనుకంజ వేశారే అన్న లాజిక్ దగ్గర స్ట్రక్ అయ్యాడు.
ఈ మాట విన్నాక తనలో మళ్లీ రాజకీయాల్లోకి తిరిగి రావడంపై ఆలోచన కలుగుతున్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో బండ్ల మళ్లీ ఆ పార్టీలో చేరి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలను కొట్టి పారేయలేమేమో.