కేసీఆర్ పై ప్రతిపక్షాల ఒత్తిడి ఎఫెక్ట్ ?

దళిత బంధు పథకం లాంటిదే భవిష్యత్తులో అన్ని వర్గాల కోసం తలో బంధు పథకం ప్రవేశపెట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. చూస్తుంటే దళిత బంధు పథకం పై ప్రతిపక్షాల ఒత్తిడి ఎఫెక్ట్ బాగానే పని చేసినట్లుంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలవడం టార్గెట్ గా కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రకటించారో వెంటనే కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు బీసీలతో పాటు ఇతర వర్గాలకు కూడా బంధు పథకాన్ని తేవాలని పదే పదే డిమాండ్ చేశాయి.

అసలే ఉప ఎన్నికలో గెలుపు టార్గెట్ గా తీసుకొచ్చిన పథకం దళిత బంధు. హుజూరాబాద్ లో ఎస్సీ ఓట్లు సుమారు 45 వేల దాకా ఉన్నాయి. అలాగే బీసీల ఓట్లు కూడా లక్షకుపైగా ఉన్నాయి. ఇక రెడ్ల ఓట్లు తక్కువేమీ కాదు. కాకపోతే మైనారిటీల ఓట్లు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఎస్సీల విషయంలో మాత్రమే కేసీఆర్ దృష్టి పెట్టారంటూ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే కేసీయార్ ను టార్గెట్ చేస్తున్నారు.

ఇదే సమయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ మిగిలిన సామాజిక వర్గాల్లోని పేదలకోసం దళిత బంధు పథకం లాంటిది కేసీయార్ ఎందుకని పెట్టడం లేదని విమర్శలు మొదలుపెట్టారు. దళిత బంధు పథకం కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే తెచ్చిన తాత్కాలిక పథకంగా రేవంత్, బండి ఇద్దరు చెరోవైపు నుండి కేసీయార్ ను వాయించేస్తున్నారు. ఇదే విషయమై జనాల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

దాంతో క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్చ కేసీఆర్ దృష్టికి వచ్చినట్లుంది. అందుకనే ఈరోజు పార్టీ ఆఫీస్ లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగున ఉన్న దళితుల కోసం దళితబంధు పథకాన్ని తెచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల కోసం పేదల బంధు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.

దళిత బంధు పథకం అమలు ద్వారా మిగిలిన సామాజిక వర్గాల్లో జరగబోయే నష్ట నివారణ కోసమే కేసీఆర్ అర్జెంటుగా పేదల బంధు పథకాన్ని ప్రకటించినట్లు అర్థమైపోతోంది. అంటే రేవంత్, బండి ఒత్తిడి కేసీఆర్ మీద బాగానే పనిచేసినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. మరి ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించిన పేదల బంధు పథకాలు ఎంతవరకు అమలవుతాయో చూడాల్సిందే.