రాజకీయాలు మామూలుగా ఏపీలో సాగడంలేదు. గతంలో ఏనాడో ఎపుడో సంచలనాలు నమోదు అయ్యేవి. కానీ వైసీపీ రాజకీయాల్లోకి వచ్చాక ప్రతీదీ సెన్షేషన్ అవుతోంది. దాంతో అటు టీడీపీలోనూ ఆ రాజకీయ ప్రకంపనలు కనిపిస్తున్నాయి. అక్కడా ఇక్కడా వెరసి ఏపీ రాజకీయమే ఎపుడూ మీడియా హెడ్ లైన్స్ లో ఉంటోంది. ఇవన్నీ పక్కన పెడితే శ్రీకాకుళానికి చెందిన వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ స్పీకర్ గా ఉన్నారన్నది తెలిసిందే. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో కానీ మంత్రి పదవి ఈసారి తనకే అని భావిస్తున్నారట.
తనకు కనుక మంత్రి పదవి జగన్ ఇవ్వకపోతే ఇక రాజకీయం ఎందుకు అన్న ధోరణిలో ఆయన ఉన్నారని టాక్. ఇదిలా ఉంటే తమ్మినేని సీతారామ్ దాదాపుగా ప్రతీ రోజు జగన్‌ను పొగుడుతున్నారు. ఇలా బాహాటంగా కీర్తించడమే కదు, జగన్ని వ్యక్తిగతంగా కలసి ఆయన తన బాధను చెప్పుకున్నారని టాక్. తనకు ఇదే చివరి చాన్స్ అని, తాను రాజకీయంగా విరామం కోరుకుంటున్నాను కాబట్టి ఈసారి మంత్రి కుర్చీలో కూర్చోబెడితే తనకు అదే పదివేలు అని కూడా చెప్పుకున్నారని టాక్.
అయితే జగన్ లెక్కలు వేరుగా ఉన్నాయి. ఆయన సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకే మంత్రి పదవులు అప్పగించాలని అనుకుంటున్నారు. అయితే తమ్మినేని విషయంలో ఆలోచిస్తే మిగిలిన వారు కూడా సీనియర్ల కోటాలో ముందుకు వస్తారు. దాంతో అందరితో పాటే తమ్మినేనికి పక్కన పెట్టేస్తారు అంటున్నారు. అయితే స్పీకర్ పదవిలో తమ్మినేని అసలు సంతృప్తిగా లేరు అంటున్నారు. ఒక వేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన స్పీకర్ కూడా కొనసాగుతారా అన్నది కూడా అనుమానమే అని తెలుస్తోంది.
మరి అలాంటి పరిస్థితే వస్తే కనుక తమ్మినేని రెండున్నరేళ్లకు ముందే రాజకీయ విరామం ప్రకటిస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. మంత్రి పదవికి అంతలా పట్టుపడుతున్న తమ్మినేని అది దక్కకపోతే రాజకీయాలకు దూరం జరిగితే స్పీకర్ కుర్చీ కూడా ఖాళీ అవుతుంది అంటున్నారు. అపుడు స్పీకర్ పదవికి కూడా కొత్త వారిని ఎన్నుకోవాలి. మొత్తానికి తమ్మినేని మంత్రి పదవి ఇవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నారు అని అర్ధం అవుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో.