వైసీపీలో ఎప్పటి నుంచో అసంతృప్తులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో గోరంట్ల ఎపిసోడ్ తర్వాత ఇది చర్చకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా, ముఖా ముఖి మాట్లాడాలన్నా కష్టమనే మాట ఎక్కువగా వినబడుతోంది. ఈ మాటలు పెరిగి పెరిగి పెద్దవై పోయి చివరకు గోరంట్ల బుచ్చయ్యలా ఎదురు తిరిగే పరిస్ధితిగా మారకూడదని అనుకుంటే జగన్ వెంటనే మేల్కొనాల్సిందే.
వాస్తవానికి రఘురామరాజు చేసిన ప్రధాన ఆరోపణ కూడా ఇదే. ఆయన ఎవరినీ అంత సులువుగా కలవరు అని. జగన్ ని కలవాలంటే మంత్రుల్లో కూడా అందరికీ వెంటనే అపాయింట్మెంట్ దొరకడం లేదనే ప్రచారం తెలిసిందే. మంత్రులకే ఈ పరిస్థితి ఎదురవుతోందంటే ఇక ఎంఎల్ఏ, ఎంపీలు, ఇతర నేతల పరిస్థితి ఇంకెలాగుంటుందో ఊహించుకోవచ్చు.
తాజాగా టీడీపీలో సంచలనమైన బుచ్చయ్య వ్యవహారమే తీసుకుందాం. గడచిన మూడేళ్లుగా తాను ఎంతగా ప్రయత్నించినా చంద్రబాబు నాయుడు, లోకేష్ తన ఫోన్లు తీయలేదని తెగ బాధపడిపోయారు. తనకు పార్టీలో ఏమాత్రం విలువ లేకుండా చేశారంటూ వాపోయారు. అధికారంలో ఉన్నపుడే గోరంట్లతో మాట్లాడటానికి ఇష్టపడని తండ్రీ, కొడుకులు ఇక ప్రతిపక్షంలోకి వచ్చినాక అయినా మాట్లాడకపోతే ఎలా?
ఇంత కాలం చూసి చూసి ఇక లాభం లేదనుకుని చివరకు బుచ్చయ్య తన ఆక్రోశాన్ని మీడియా ముందుంచారు. దాంతో బుచ్చయ్య వ్యవహారం టీడీపీలో ఎంత అలజడి రేపుతున్నదో అందరు చూస్తున్నదే. ఇపుడు ఈయన బయట పడినట్లే టీడీపీలో ఇంకా ఎంతమంది బుచ్చయ్యలున్నారో తెలీదు. ఎంతమంది బుచ్చయ్యలున్నా టీడీపీకి కొత్తగా జరిగే నష్టం లేదు కాబట్టి పెద్దగా సమస్య లేదు. కానీ ఇలాంటి అసంతృప్తులు వైసీపీలో కూడా ఉంటే జగన్ కు చాలా నష్టమని చెప్పవచ్చు.
ఇపుడు అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్ అంటే భయంతో ఎవరు బయటపడకపోవచ్చు. కానీ రేపు ఎన్నికల ముందు ఇలాంటి అసంతృప్తులు ధైర్యంగా బయటకు వస్తే పార్టీకి డ్యామేజి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మేల్కొని మంత్రులు, ఎంఎల్ఏ, ఎంపిలతో పాటు నేతలకు కూడా అపాయిట్మెంట్లివ్వాలి. పార్టీలోని, ప్రతిపక్షంలోని ప్రజాప్రతినిధులు, నేతలతో మాట్లాడే విధానంలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విధానాన్ని ఫాలో అవ్వాల్సిందే. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సిందే తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates