ఏపీ స్కూళ్లలో బయపడతున్న కరోనా ..

మొన్న 16వ తేదీన స్కూళ్ళు తెరిచిన దగ్గర నుంచి కరోనా వైరస్ మళ్ళీ బయటపడుతోంది. 16వ తేదీ నుంచి ఏపీలో హై స్కూళ్ళు తెరిచిన విషయం అందరికీ తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఒంగోలులోని ఓ స్కూల్ లో పరీక్షలు చేస్తే నలుగురు టీచర్లు, ముగ్గురు విద్యార్ధులకు కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దాంతో వెంటనే స్కూలును మూసేశారు. తాజాగా కృష్ణ జిల్లా, ముదినేపల్లి మండలంలోని పెదపాలపర్రు గ్రామంలోని స్కూల్ లో 10 మంది పిల్లలకు కరోనా వైరస్ ఉన్నట్లు బయటపడింది.

ప్రతి స్కూలులోను వారానికి ఒకసారి కరోనా వైరస్ ర్యాండమ్ టెస్టు జరగాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారమే అన్నీ స్కూళ్ళల్లోను హెడ్ మాస్టర్ టీచర్లు, విద్యార్థులందరికీ కరోనా వైరస్ టెస్టులు చేయిస్తున్నారు. ఒంగోలు, కృష్ణా జిల్లాల్లోని రెండు స్కూళ్ళల్లో కేసులు బయటపడ్డాయి. దీంతో రెండు స్కూళ్ళు మూసేశారు. మళ్ళీ ఎప్పుడు స్కూళ్ళని తెరుస్తారో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు.

ఇప్పుడే కాదు గతంలో కూడా స్కూళ్ళని తెరవటం, కరోనా వైరస్ కేసులు బయటపడగానే మళ్ళీ వెంటనే స్కూళ్ళని మూసేయటం అందరికీ తెలిసిందే. నిజానికి కరోనా వైరస్ మన సమాజంలో నుండి నూరుశాతం పోలేదన్నది నిజం. ప్రభుత్వాలు లాక్ డౌన్ను ఎత్తేయడం, కర్ఫ్యూ సడలించడంతో జనాలు బయట తిరిగేస్తున్నారు. బయటతిరుగుతున్న జనాల్లో చాలామంది మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరాన్ని పాటించకుండా తిరిగేస్తున్న జనాలే ఎక్కువమంది.

ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా పాటిస్తున్న జనాల సంఖ్య మాత్రం తక్కువనే చెప్పాలి. ఇదే సమయంలో కోవిడ్ టీకాలు వేయించుకోవటం కూడా తగ్గిపోయింది. అవసరాల మేరకు కోవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయలేక పోవడం వల్ల రాష్ట్రాల్లో టీకాల కార్యక్రమం తగ్గిపోయింది. దాంతో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఆగస్టు-అక్టోబర్ మధ్య కరోనా వైరస్ థర్డ్ వేవ్ విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఎవరు పట్టించుకోవటంలేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్ళు తెరవటంతో కేసులు బయటపడుతున్నాయి. మరి బయటపడుతున్న కేసుల నేపథ్యంలో ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.