చీకటి నిజాలు: అఫ్ఘాన్ ఎందుకు భ‌య‌ప‌డుతోంది? ఇది చ‌ద‌వండి!

తాలిబ‌న్ సామ్రాజ్యం.. అఫ్ఘ‌నిస్థాన్‌కు కొత్తకాదు. గ‌త 20 ఏళ్ల కింద‌టి వ‌ర‌కు తాలిబ‌న్లే.. అఫ్ఘాన్‌ను పాలించారు. అయితే.. అప్ప‌ట్లో 20 శాతం మంది మాత్ర‌మే తాలిబ‌న్ల‌ను స‌మ‌ర్థించ‌గా.. ఇప్పుడు ఈ సంఖ్య 15 శాతానికి దిగజారింది. అంటే.. తాలిబ‌న్ల పాల‌న కావాల‌ని కోరుకునేవారు కూడా అఫ్ఘ‌న్‌లో ఉన్నారు. ఇది ఎందుకు? నిజానికి తాలిబ‌న్లంటే.. అఫ్ఘ‌న్ల‌కు భ‌య‌మా? లేక‌.. వారు అనుస‌రించే పాల‌న అంటే.. భ‌య‌మా? వెర‌సి.. అస‌లు ఎందుకు అఫ్ఘ‌న్లు.. ఇత‌ర దేశాల‌కు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వ‌ల‌స పోతున్నారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. నిజంగానే తాలిబ‌న్లు అంత క్రూరులైతే.. ప్ర‌స్తుతం 15 శాతం మందైనా వారిని ఎందుకు స‌పోర్టు చేస్తున్నారు? అనేది ప్ర‌శ్న‌.

విష‌యంలోకి వెళ్తే.. చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా.. ఉన్న‌ప్ప‌టికీ.. అమ‌లు చేసేవారే కీల‌కం. ప్ర‌జాస్వామ్య దేశాల్లో.. చ‌ట్టాల‌ను అమ‌లు చేసేవారిలో లోపాలు ఉన్నాయ‌నేది ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రించే అంశమే. అయితే.. ప్ర‌జ‌ల హ‌క్కుల‌కు.. ప్రాధాన్యం ఇవ్వాలి క‌నుక‌… ప్ర‌జాస్వామ్యంలో కొన్ని లోపాలు ఉన్న‌ప్ప‌టికీ వాటిని త‌ట్టుకుని ప్ర‌జ‌లు ప్ర‌జాస్వామ్యానికే ఓటు వేస్తున్నారు. కానీ.. తాలిబ‌న్లు అనుస‌రిస్తున్న చ‌ట్టాలు ఎంత క‌ఠిన‌మో… వాటిని అమ‌లు చేసే వారు కూడా అంతే క‌ఠినంగా ఉంటారు. అంటే.. చ‌ట్టంలో ఏం రాసి ఉందో.. ఖ‌చ్చితంగా తూ.చ త‌ప్ప‌కుండా అమ‌లు చేయ‌డం తాలిబ‌న్ల ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. ఇందులో ఎలాంటి రాజీలు.. క్ష‌మాభిక్ష‌లు ఉండ‌వు.

ఇదే ఇప్పుడు అఫ్ఘ‌న్ల‌కు ప్రాణ‌సంక‌టంగా మారింది. బీద‌రికం వ‌ల‌లో చిక్కిన అఫ్ఘ‌న్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచిన 20 ఏళ్లుగా స్వేచ్ఛ ఉంది. వారు ఏం చేసినా.. చ‌ట్టం ప‌రిధిలో చేయ‌క‌పోయినా.. ప్ర‌భుత్వాలు చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించాయి. కానీ, ఇప్పుడు తాలిబ‌న్లు దేశాన్ని వ‌శం చేసుకున్నాక‌.. వారు అనుస‌రించే చ‌ట్టం.. ష‌రియా(ముస్లిం చ‌ట్టం) ప‌క‌డ్బందీగా అమ‌లు కానుంది. ఇదే ఇప్పుడు అప్ఘ‌న్ల‌కు ఇబ్బందిగా మారింది. షరియా అంటే ఖురాన్, సున్నాహ్, హదిత్ మతగ్రంధాల నుంచి తీసుకున్న నిబంధనల సమాహారమే షరియా.

వీటి నుంచి నేరుగా చట్టాలు రావుకానీ, మతసంబంధ విజ్ఞులు ఈ గ్రంథాలను అనుసరించి ముస్లింలు ఎలా జీవించాలో నిర్దేశిస్తారు. షరియా చట్టంలో ముస్లింలు ఎలా జీవించాలనే విధానాన్ని చెప్తారు. ఎప్పుడు ప్రార్థనలు చేయాలి? ఎప్పుడు ఉపవాసాలు ఉండాలి? ఎలాంటి వారికి దానాలు చేయాలి? దేవుని ఆదేశాల మేరకు ఎలా జీవించాలనే విషయాన్ని ముస్లింలు అర్థం చేసుకోవడానికి ఈ షరియా చట్టం నిర్దేశించింది. అయితే దీన్ని తాలిబన్లు చాలా కఠినంగా అమలు చేస్తారు. అందుకే ప్రజలకు తాలిబన్లు అన్నా, వారి చట్టాలన్నా వణికిపోతున్నారు.

షరియా అంటే సరైన అర్థం ‘భగవంతుని చేరే మార్గం’. జీవితంలో ఏ విషయంలో అయినా సమస్య వస్తే షరియా చట్టాలను ఆశ్రయించవచ్చు. ఈ చట్టాలు తెలిసిన స్కాలర్స్.. మతపరమైన ఫ్రేమ్ వర్క్‌లో సదరు సమస్యను ఎలా అధిగమించాలో చెప్తారు. కుటుంబ చట్టాలు, ఆర్థిక వ్యాపార సంబంధిత అంశాల్లో కూడా షరియా చట్టాలుగా మార్గనిర్దేశం చేస్తాయట. ప్రపంచంలోని ఏ న్యాయవ్యవస్థ అయినా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. షరియా చట్టం కూడా అంతే. ఈ చట్టాలు అమలు చేసే వారి విజ్ఞత, అనుభవంపై ఆధారపడి ఉంటాయి. ఇస్లామిక్ జ్యూరిస్టులు చేసే చట్టాలను ఫత్వాలంటారు.

షరియాకు సంబంధించి ఐదు రకాల విద్యాభ్యాసాలున్నాయి. వాటిలో నాలుగు సున్నీ విధానాలు, అవి హన్‌బలి, మాలికి, షఫిఈ, హనాఫీ. మరొకటి షియా విధానం, జాఫరీ. ఈ ఐదు విధానాల్లో షరియా చట్టాలను భిన్నంగా వివరిస్తాయి. అలాగే స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు కూడా ఈ చట్టంపై ప్రభావం చూపుతా యి. అంటే వివిధ ప్రాంతాల్లో ఈ చట్టాలు వేరే వేరేగా ఉండొచ్చు. తాలిబన్లు వీటిలో చాలా క‌ఠిన‌మైన విధానాలను అమలు చేస్తారు. షరియా ముస్లింల జీవన విధానానికి సంబంధించిందే అయినా.. నేరాలకు ఎలాంటి శిక్షలు వేయాలో కూడా దీనిలో ఉంటుంది. ఈ చట్టాలు నేరాలను ప్రధానంగా మూడు విభాగాలు గా వర్గీకరిస్తాయి.

అవి హుదుద్, ఖిసాస్, తాజిర్. హుదుద్ అంటే చాలా సీరియస్ నేరాలు. వీటికి చాలా క్రూరమైన శిక్షలుంటాయి. రెండో వర్గమైన ఖిసాస్‌లో ఎటువంటి నేరం చేశారో అదే నేరాన్ని నిందితుడికి శిక్షగా వేస్తారు. మూడో వర్గమైన తాజిర్ నేరాలకు వేసే శిక్షలు సదరు కేసులో జడ్జి విజ్ఞతకే వదిలేయడం జరుగుతుంది. ఈ హుదుద్ నేరాల్లో దొంగతనం, వివాహేత‌ర‌ సంబంధాలు వంటివి ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా దొంగతనం చేస్తే..(ఇటీవ‌ల కాలంలో అఫ్ఘ‌న్‌లో ఇవి పెరిగిపోయాయి. ఉపాధి లేక‌.. క‌రోనా నేప‌థ్యంలో దొంగ‌త‌నాలు పెరిగాయి). షరియాలోని కఠిన చట్టాలననుసరించి వారి చేతులు నరికేస్తారు.

అలాగే ఎవరైనా స్త్రీ, పురుషులు వివాహేత‌ర సంబంధం కలిగి ఉన్నట్లు తెలిస్తే వారిని నడిరోడ్డుపై రాళ్లతో కొట్టి చంపుతారు. ఇక‌, రియా చట్టాలు మహిళల విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి? ఎవరితో మాట్లాడాలి? వంటి అంశాలను కూడా వివరిస్తాయి. ఈ చట్టాల ప్రకారం, స్త్రీలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రాకూడదు. పరాయి పురుషుడితో మాట్లాడకూడదు. కుటుంబాలతో కలిసి పార్టీలకు వెళ్లడానికి షరియా చట్టం అనుమతిస్తుంది. కానీ పార్టీకి వెళ్లిన తర్వాత పరాయి కుటుంబంలోని పురుషులతో మాట్లాడితే అది నేరం!

అలాగే స్త్రీలు పూర్తిగా శరీరాన్ని కప్పుకునే దుస్తులే ధరించాలి. వాళ్లు చదువుకోవడానికి వీల్లేదు. 8 ఏళ్లు దాటిన ప్రతి అమ్మాయీ బుర‌ఖా ధరించాల్సిందే. ఈ అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే పక్కనే ఎవరో ఒక పురుషుడు తోడుండాల్సిందే. ఆడవాళ్లు హైహీల్స్ కూడా వేసుకోకూడదు. ఎందుకంటే మహిళల అడుగుల చప్పుడు ఏ పురుషుడుకీ వినిపించకూడదు.

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు మాట్లాడితే ఆ మాటలు పరాయి పురుషుడికి వినిపించకూడదు. మహిళల ఫొటోలు తీయడం, వీడియోలు చేయకూడదు. న్యూస్‌పేపర్లు, పుస్తకాలు, షాపుల్లో ఆడవాళ్ల ఫొటోలు పెట్టడం నిషేధం. ఇంటి బాల్కనీల్లో మహిళలు కనిపించకూడదు. గతంలో తాలిబన్లు అఫ్ఘానిస్థాన్‌ను పాలించిన సమయంలో ఈ నిబంధనలు ఉల్లంఘించిన మహిళలను రోడ్డుపై పడేసి కొట్టేవారు. ఒక్కోసారి రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచేవాళ్లు. కొన్ని అరుదైన ఘటనల్లో బహిరంగంగా తల నరికి చంపేవారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరూ ఇంత కఠినమైన నిబంధనలు అమలు చేయలేదు. సాధారణ జీవనం సాగించారు. ఇప్పుడు తాలిబన్లు అధికారంలోకి రావడంతో వీళ్ల గత జీవన విధానన్ని తప్పుబట్టి, ఇప్పుడు శిక్షలు వేస్తారేమో అని అఫ్ఘాన్ల భయం. అఫ్ఘాన్ మహిళలు కొందరు సైన్యంలో పనిచేయగా, మరికొందరు ఎన్నికల్లో నిలబడి మేయర్లుగా గెలిచారు. వీళ్లంతా ఇప్పుడు తాలిబన్ల దృష్టిలో భయంకరమైన పాపం చేసినవాళ్లే. ఇలాంటి వారిని వాళ్లు బహిరంగంగా తల నరికి చంపుతారు. ఈ నేప‌థ్యంలోనే అఫ్ఘ‌న్ ఇప్పుడు భ‌యం గుప్పిట్లో ఉండ‌డం గ‌మ‌నార్హం.