కాబూల్ విమాన మృతుల్లో యువ ఫుట్ బాల్ ప్లేయర్..!

ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించేశారు. ఆ దేశ అధ్యక్షుడు కూడా అక్కడి నుంచి పరారయ్యాడు. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ ని ఆక్రమించుకున్నారనే విషయం తెలియగానే.. దేశ ప్రజలు భయంతో వణికిపోయారు.

ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఆఖరికి విమానాల పైకి ఎక్కి మరీ ప్రయాణం చేశారు. అలా అమెరికా సైనిక విమానం పట్టుకుని వేలాడి ముగ్గురు చనిపోయారు. వారిలో ఆఫ్ఘాన్ యువ ఫుట్ బాల్ ఆటగాడు జకీ అన్వారీ కూడా ఉండటం గమనార్హం.

19 ఏళ్ల అన్వారీ కాబూల్ లోని ఎస్తెఘ్ లాల్ స్కూల్ లో చదువుతున్నాడు. ఫుట్ బాల్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ యూత్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్ బాల్ మీద ప్రేమ.. తాలిబన్ల చేతిలో బలవ్వకూడదన్న భయం.. అతడ్ని విమానం పైకి ఎక్కేలా చేశాయి. ఆరోజు సీ-17 ల్యాండింగ్ పరికరాలపైకి ఎక్కి దేశాన్ని వీడాలని భావించి… విమానం గాల్లోకి లేవగానే అక్కడి నుంచి జారిపడి చనిపోయాడు.

విమానం గాల్లో ఉండగా… అక్కడి నుంచి ముగ్గురు వ్యక్తులు జారి పడిన వీడియో ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.