ప్రపంచమంతా ఆశ్చర్యపోయే ఘటనలు ఆప్ఘనిస్థాన్‌లో మొదలయ్యాయా ? అవుననే అంటోంది ప్రపంచ మీడియా. తాలిబన్లకు భయపడిపోయి దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం వదిలి పారిపోయాడు. ఆయనతో పాటు కొందరు మంత్రులు, గవర్నర్లు, కీలక నేతలు కూడా దేశం నుంచి మాయమైపోయారు. దేశంలో మిగిలిన సైన్యంతో పాటు మగాళ్లు కూడా తాలిబన్ల ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఇలాంటి నేపధ్యంలోనే మహిళల్లో కొందరు తాలిబన్లపై తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేశారనే కారణంగా జలాలాబాద్ లో ఇద్దరు మహిళలను తాలిబన్లు కాల్చి చంపేశారు.
20 ఏళ్ళపాటు అనుభవించిన స్వేచ్చా, సమానత్వం ఒక్క దెబ్బకు తాలిబన్ల రూపంలో కూలిపోవటాన్ని మహిళలు సహించలేక పోతున్నట్లు తాజా ఘటనలతో ప్రపంచానికి తెలిస్తోంది. దేశంలోని కొన్ని చోట్ల మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. తమ స్వేచ్చను హరించవద్దని, హింసాకాండకు దిగవద్దని గట్టిగా గర్జించారు. మహిళలుగా తమ హక్కులను కాలరాయద్దని రాసున్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్లపైన నిలబడటమే ఆశ్చర్యంగా ఉంది.
తాలిబన్ల రాజ్యంలో ఒంటిమీద బురఖాలు వేసుకోకుండా అదీ మగాళ్ళ తోడులేకుండా ఆడవాళ్ళు రోడ్లపైకి రావటం నిషిద్ధం. చేతి వేళ్ళు కూడా ఆడవాళ్లు బహిరంగంగా కనబడనీయకూడదనేది తాలిబన్ల చట్టం. ఆ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని నిర్దాక్షిణ్యంగా రోడ్లపైన ఉరి తీయటమో లేకపోతే అక్కడికక్కడే కాల్చిచంపేయటమో చేస్తారు. ఇలాంటి రాతి యుగం నాటి చట్టాలను అమలు చేస్తున్న తాలిబన్ల ముందే ఆడవాళ్ళు మొహాన్ని కప్పుకోకుండా బుధవారం గుంపులుగా రోడ్లపైన ప్లకార్డులు పట్టుకుని నిలబడటమంటే చావుకు ఎదురెళ్ళటమే.
ఈ విషయం ఆఫ్ఘనిస్థాన్‌లోని మహిళలకన్నా బాగా తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఇంకెవరుంటారు ? అయినా సరే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మగవాళ్ళు భయపడి ఇంట్లో కూర్చునుంటే ఆడవాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసలు తెలపటమంటే మామూలు విషయం కాదు. బహుశా ఈ విషయాలను తాలిబన్లు కూడా ముందే గ్రహించారేమో. అందుకనే ఆడవాళ్ళు నిర్భయంగా స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళి చదువుకోవచ్చన్నారు. అవకాశం ఉన్నచోట ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చన్నారు. బురఖాలతో మొహాలు కప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఇన్ని చెప్పిన తాలిబన్లు ఒక మెలిక పెట్టారు. అదేమిటంటే తాము చెప్పినవన్నీ షరియా చట్టాలకు లోబడే అమలవుతాయని స్పష్టంచేశారు. షరియా చట్టాలంటే మళ్ళీ మహిళలకు స్వేచ్ఛ లేకపోవటమే. షరియా చట్టాల ప్రకారం మగతోడు లేకుండా ఆడవాళ్ళు బయటకు రాకూడదు, ఒళ్ళంతా కప్పుకుంటూ బురఖా వేసుకోవాల్సిందే, మత గ్రంధాలు తప్ప ఇంకేమీ చదువుకోకూడదనే చాలా నిబంధనలున్నాయి. అందుకే మహిళలు ఇపుడు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నది. మరి తాజా ఘటనలు ఎక్కడికి దారితీస్తాయో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates