ఆప్ఘనిస్తాన్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ చేరుకునే సమయానికే.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని పరారయ్యారు. అయితే.. పరారయ్యే సమయంలో ఆయన డబ్బులు తీసుకోని పారరయ్యారంటూ వార్తలు వచ్చాయి. కాగా.. ఆ ఆరోపణలపై ఆయన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. దాంట్లో తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు.
అఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ముందు దేశ నిధుల నుంచి 169 మిలియన్ డాలర్లను దొంగిలించి తీసుకెళ్లానని రష్యా దేశ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలను ఘనీ ఖండించారు. తాను యునైటెడ్ ఎమిరేట్స్ లో ఉన్నానని ఘనీ ధ్రువీకరించారు.
తాను డబ్బు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఘని వీడియోలో వివరించారు. తాను నాలుగు కార్లు, హెలికాప్టరు నిండా నగదుతో కాబూల్ నుంచి పారిపోయానని రష్యా రాయబారి చేసిన ఆరోపణలను ఘనీ కొట్టివేశారు. తాను డబ్బుతో పారిపోయాననేది అబద్ధమని.. దీన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతోనూ ధ్రువీకరించుకోవచ్చని ఘని చెప్పారు. దేశాధినేతగా తనకున్న ముప్పతో పారిపోయానని చెప్పారు.
దేశంలో రక్తపాతాన్ని నివారించడానికి ఏకైకమార్గంగా తాను కాబూల్ నుంచి పారిపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఘనీ సమర్థించుకున్నారు. అఫ్ఘాన్ భద్రతా దళాలకు ఘనీ కృతజ్ఞతలు తెలిపారు. శాంతి ప్రక్రియ వైఫల్యం తాలిబాన్లు అధికారాన్ని లాక్కోవడానికి దారితీసిందని ఆయన చెప్పారు.
తాను మళ్లీ తిరిగి దేశంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు తాను శాంతియుతంగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates