తెలంగాణా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల వ్యవహారం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపధ్యంలో రాజకీయాలు చాలా హాటు హాటుగా మారిపోయిన విషయం తెలిసిందే. తొందరలో జరగబోయే ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఒకవైపు కేసీయార్ మరోవైపు ఈటల రాజేందర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యలో కాంగ్రెస్ కూడా తన బలాన్ని చాటుకోవటానికి శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఫుల్లు జోరుమీదున్నాయి.
ప్రధాన పార్టీలు ఇంత హడావుడిగా ఉండగా మరి మిగిలిన పార్టీలు ఏమి చేస్తున్నాయి ? ఏమి చేస్తున్నాయంటే కేవలం ఉనికికోసం నానా అవస్తలు పడుతున్నాయి. మిగిలిన పార్టీలను వదిలిస్తే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పరిస్ధితే మరీ అయోమయంగా తయారైంది. అసలలా పార్టీగురించి పట్టించుకుంటున్న వారే కనబడటంలేదు. మంగళవారం అంటే ఈరోజు ఆమె నిరాహారదీక్ష చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, వెంటనే ఉద్యోగాల భర్తీకి కేసీయార్ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో షర్మిల నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.
తన డిమాండ్ లో భాగంగా ఇప్పటికి నాలుగు జిల్లాల్లో దీక్షలు చేసిన ఆమె ఈరోజు మహబూబ్ నగర్ లో నిరాహారదీక్షకు రెడీ అయ్యారు. గూడూరు మండలంలోని గుండెంగ గ్రామాన్ని తన దీక్షకు షర్మిల వేదికగా చేసుకున్నారు. ఒకవైపు ప్రధాన పార్టీలన్నీ దళితబంధు పథకం చుట్టూనే తిరుగుతున్నాయి. అలాగే ఈ పథకాన్ని కేసీయార్ హడావుడిగా ప్రారంభించటానికి కారణమైన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా బిజీగా ఉన్నాయి.
అయితే షర్మిల మాత్రం దళితబంధు పథకం విషయాన్ని కానీ లేదా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయాన్ని కానీ తనకేమీ పట్టదన్నట్లుగా ఉన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరైనా నిరుద్యోగి పోటీచేస్తే సహకరిస్తామనే ఓ ప్రకటన ఇచ్చేసి ఊరుకున్నారు. ఇక ఉపఎన్నికలో ఎలాగూ పోటీచేసేది లేదుకాబట్టి దళితబంధు పథకం విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు లేదు. దాంతో షర్మిల గురించి ఆలోచించే జనాలే కనబడటంలేదు. మొత్తానికి తెలంగాణాలో తన ఉనికిని నిలబెట్టుకునేందుకు మాత్రమే నిరాహార దీక్షలు చేస్తున్నట్లుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates