జీవోల విష‌యంలో ర‌చ్చ‌…జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇటీవ‌ల తెర‌మీద‌కు వ‌చ్చి బ్లాంక్ జీవోల వివాదంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జీవోలు ఇకపై ఆన్ లైన్లో పెట్టకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అన్న దానికే అర్ధాన్ని మార్చేసి గోల్ మాల్ ఆర్డర్ అన్న విధంగా బ్లాంక్ జీవోలను జారీ చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించిన అనంత‌రం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌ల రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు 14 జీవోలను విడుదల చేయ‌గా పది జీవోలను ప్రభుత్వ వెబ్ సైట్ లో బ్లాంక్ గానే ఉంచారు. వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటుకు 85 లక్షల రూపాయల విడుదలతో పాటుగా మరో మూడు జీవోలలో సమాచారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచగా… మిగతా అన్ని జీవోలను బ్లాంక్ గా వెబ్ సైట్ లో పెట్టారు. దీనిపై దుమారం రేగింది. ఏపీ ప్ర‌భుత్వం ర‌హ‌స్య జీవోల‌తో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని టీడీపీ విమ‌ర్శించింది. దీంతో పాటుగా ఏపీ సీఎంను టార్గెట్ చేసింది.

ఓ వైపు ఈ వివాదం కొన‌సాగుతుండ‌గా తాజాగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. జీవోలను ఆఫ్ లైన్ లో మాత్ర‌మే ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీంతో ఇకపై పబ్లిక్ డొమైనులో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఏవి కనిపించవు. అయితే ఇలా జీవోలను పబ్లిక్ డొమైనుల్లో ఉత్తర్వులు ఉంచడం 2008 న ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానానికి బ్రేక్ వేసింది. అయితే, పొరుగునున్న రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాన్నే ఏపీ ప్ర‌భుత్వం సైతం అవలంభించాలని భావిస్తున్న‌ట్లు అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.