మొత్తానికి తెలుగు సినిమా నిర్మాతల వేదన తీరబోతున్నట్లే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయన్న మాటే కానీ.. పూర్తి స్థాయిలో ఆదాయం మాత్రం రావట్లేదు. అందుక్కారణం కొన్ని నెలల కిందట ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ తేవడమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ సందర్భంగా దశాబ్దం కిందటి రేట్లకు సంబంధించి జీవోను బయటికి తీసి అధికారులు కొరడా ఝులిపించడంతో ఇండస్ట్రీకి పెద్ద కష్టమే వచ్చింది. అసలే కరోనా వల్ల దారుణంగా దెబ్బ తిన్న థియేటర్ల వ్యవస్థకు ఈ జీవో అశనిపాతంలా మారింది.
ఏపీ ప్రభుత్వం పవన్ను ఇబ్బంది పెట్టడానికే ఈ జీవోను బయటికి తీసి టికెట్ల రేట్లపై నియంత్రణ తెచ్చిందన్నది బహిరంగ రహస్యం. కానీ అతణ్ని ఇబ్బంది పెట్టబోయి మొత్తం ఇండస్ట్రీ మెడకు చుట్టుకుంది. జగన్ సర్కారుకు ఇది పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది.
ఈ పరిస్థితుల్లో నిర్ణయాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో తెలియని సంకట స్థితిలో పడింది జగన్ ప్రభుత్వం. వెంటనే నిర్ణయాన్ని మారిస్తే పవన్ను ఇబ్బంది పెట్టేందుకు తాత్కాలికంగా హడావుడి చేశారన్న సంకేతాలు జనాల్లోకి వెళ్తాయి. అందుకే కొన్నాళ్లు వేచి చూశారు. ఇప్పుడు స్వయంగా ప్రభుత్వం నుంచి టాలీవుడ్ పెద్దలకు చర్చల కోసం పిలుపు వెళ్లింది. ఈ విషయంలో జగన్ ఇగో పక్కన పెట్టి చిరు అండ్ కోకు కబురు పంపడం విశేషమే. టికెట్ల రేట్లు, ఇతర సమస్యలపై ప్రభుత్వ వైఖరి మారకుంటే మున్ముందు అది జగన్కు మరింత చెడ్డ పేరు తేవచ్చు.
అందుకే ఇగో పక్కన పెట్టి సినీ పెద్దలకు జగన్ పిలుపు పంపినట్లు తెలుస్తోంది. మున్ముందు పెద్ద సినిమాలు చాలానే రిలీజ్ కాబోతున్నాయి. వాటికీ టికెట్ల నియంత్రణ తీసుకొస్తే ఏపీ ప్రభుత్వానికి అందరు హీరోల అభిమానుల నుంచి వ్యతిరేకత తప్పదు. అందుకే ఇప్పుడిలా పిలిచి మరీ మీటింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది.