ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళిత బంధు పథకమే చివరకు కేసీయార్ కొంప ముంచేట్లుంది. ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ లో జరగబోయే బహిరంగ సభలో కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే తాను దత్తత తీసుకున్న నల్గొండ జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో పథకాన్ని సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. 16వ తేదీ బహిరంగ సభలో లబ్దిదారులను ప్రకటించబోతున్నారు.
ఇందులో భాగంగానే అధికారులు శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం మొదలుపెట్టారు. దీంతో చాలా గ్రామాల్లో దళితులకు, అధికారులకు మధ్య పెద్ద గొడవలే జరిగాయి. దళితబంధు పథకంలో లబ్దిదారులుగా టీఆర్ఎస్ కార్యకర్తలను, భూమి ఉన్నవారిని, ఉద్యోగుల కుటుంబాలనే ఎంపిక చేస్తున్నారంటు వీణవంక, కందుగుల, కోరపల్లి తదితర గ్రామాల్లో పెద్దఎత్తున దళితులు ఆందోళనలు చేశారు.
కేసీయార్ పథకాన్ని పెట్టింది దళితుల కోసమా లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తల కోసమా అంటూ ఎంఆర్వోలను దళితులు, దళిత సంఘాలు నిలదీశాయి. దాంతో అధికారులు, టీఆర్ఎస్ నేతలతో దళితులకు చాలా గ్రామాల్లో గొడవలు జరిగాయి. నిజానికి దళితబంధు పథకంలో లబ్దిదారులుగా భూమిలేని వారిని, నిరుపేదలను, కూలీలకు, నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మధ్యలో మంత్రులు, పార్టీ ఎంఎల్ఏ లు, నేతలు జోక్యం చేసుకోవడంతో లబ్ధిదారుల ఎంపికంతా రాజకీయమైపోయింది.
నియోజకవర్గంలో 5 వేల మంది లబ్దిదారులకు తలా రు. 10 లక్షలు పంపిణీ చేయాలన్నది కేసీఆర్ టార్గెట్. ఒకేసారి వేలాదిమంది లబ్దిదారులకు పెద్ద మొత్తంలో డబ్బులు అందుతుండటంతో లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతల జోక్యం బాగా పెరిగిపోతోంది. వీరిని కాదనలేక అధికారులు కూడా వాళ్ళు చెప్పిన వారికి జాబితాలో చోటు కల్పిస్తున్నారు. దాంతో దళితులు అధికార, పార్టీ నేతలపై తిరగబడుతున్నారు. చివరకు ఇదంతా కలిసి 16వ తేదీ సభలోనో లేకపోతే ఉప ఎన్నికలోనో కేసీయార్ కొంప ముంచుతుందనే ప్రచారం పెరిగిపోతోంది.