కరోనా వైరస్..ఒకరికి ఉంటే వందమందికి చాలా తేలిగ్గా సోకేస్తుంది. ఈ లక్షణం వల్లే ప్రపంచంలో కొన్ని కోట్లమంది వైరస్ భారినపడ్డారు. మనదేశంలో కూడా కొన్ని వేలమరణాలకు కరోనా వైరస్సే కారణమవ్వటం నిజంగా దురదృష్టకరం. ఇలాంటి ప్రాణంతాక వైరస్ ను ఇంటిముందే పెట్టుకుని ఈనెల 16వ తేదీనుండి స్కూళ్ళు తెరవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఎంతమాత్రం శ్రయేస్కరంకాదు.
గతంలో కూడా కొన్ని సార్లు స్కూళ్ళు తెరవటానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే విద్యార్ధులకో లేదా టీచర్లకో కరోనా వైరస్ సోకటం వల్ల స్కూల్లోని చాలామందికి సోకింది. దాంతో అప్పటికప్పుడు స్కూళ్ళని మూసేసిన ఘటనలున్నాయి. ఇపుడిదంతా ఎందుకంటే రేపు 16వ తేదీనుండి స్కూళ్ళు తెరవాలని ప్రభుత్వం గట్టి పట్టుదలగా ఉంది. అయితే గతంలోనే ఇదే విషయమై జగన్ మాట్లాడుతూ స్కూళ్ళు తెరిచేటప్పటికే అందరు టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని చెప్పారు.
అయితే వాస్తవం ఏమిటి ? ఏమిటంటే ఇంకా 70 వేలమంది టీచర్లకు వ్యాక్సినేషన్ కాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్ళల్లో సుమారు 2.83 లక్షలమంది టీచర్లు పనిచేస్తున్నారు. వీళ్ళల్లో 1.34 లక్షల మంది మాత్రమే మొదటి డోసు వేయించుకున్నారు. రెండో డోసు వేయించుకున్న టీచర్లు సుమారు 80 వేలమందున్నారు. అంటే గతంలో జగన్ చెప్పినట్లు నూరుశాతం వ్యాక్సినేషన్ కాలేదన్నది వాస్తవం. మరి టీచర్లకు నూరుశాతం వ్యాక్సినేషన్ కాకుండానే స్కూళ్ళు ఎలా తెరుస్తారు ?
ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండు డోసుల టీకాలు వేసుకున్నవారికి కూడా కరోనా వైరస్ సోకుతోందన్న విషయమే ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి నేపధ్యంలో ప్రభుత్వం ఎంతజాగ్రత్తగా ఉండాలి ? టీచర్ల సంగతిని పక్కనపెట్టేస్తే విద్యార్ధుల్లో ఎవరైనా వైరస్ సోకిన వాళ్ళుంటే వెంటనే అందరికీ సోకటానికి ఎక్కువ రోజులుపట్టదు. అప్పుడెవరికైనా జరగరానికి జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా ? మరి స్కూళ్ళు ఎప్పుడు తెరవాలి ? అంటే సమస్య ఉన్నంత కాలం స్కూళ్ళు తెరవటం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.
స్కూళ్ళ రీఓపెనింగ్-కరోనా వైరస్ తీవ్రత విషయంలో ప్రిస్టేజీకి పోతే నష్టపోయేది విద్యార్ధులే అన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి. వైరస్ విద్యార్ధికి సోకితే అది విద్యార్ధికి మాత్రమే పరిమితం కాదు. వాళ్ళ ఇంట్లోని అందరికీ సోకుతుంది. అప్పుడు కుటుంబాలకు కుటుంబాలే వైరస్ భారిన పడటం ఖాయం. దాంతో కరోనా వైరస్ మళ్ళీ ప్రమాధకరంగా వ్యాపించేస్తుంది. కాబట్టి ఈ సమస్య సమూలంగా పోయిందనేంతవరకు ఆన్ లైన్లో క్లాసులు నడపటమే మంచిది.