కరోనా-లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆదాయం, పని కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడ్డ నేపథ్యంలో నెలవారీ ఈఎంఐలు చెల్లించడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో మారటోరియంకు అవకాశమిచ్చింది రిజర్వ్ బ్యాంకు.
మూడు నెలల పాటు ఈఎంఐలు వాయిదా పడ్డాయని సంతోషించారు జనాలు. కానీ ఈ మూడు నెలల ఈఎంఐని అసలులోకి కలిపేసి దాని మీద వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించడం.. చివర్లో అదనంగా మూడు నెలలు కాకుండా ఏడెనిమిది నెలల ఈఎంఐ భారం పడేట్లు ఉండటంతో జనాలు దీనిపై ఆవేదన చెందుతున్నారు.
కొందరు ఆ భారాన్ని మోయడానికి సిద్ధం కాగా.. ఇంకొందరు ఎందుకొచ్చిన భారమని మారటోరియం తీసుకోవడం మానేస్తున్నారు. అదనంగా మరో మూడు నెలలు మారటోరియాన్ని పొడిగించినా సరైన స్పందన లేదు. ఐతే మారటోరియంలో ఇలాంటి మెలిక పెట్టడం పట్ల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
రుణ వాయిదాలపై కూడా బ్యాంకులు వడ్డీని వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐకి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఇప్పుడు రుణ చెల్లింపుదారులకు ఉపశమనం అవసరమని, చెల్లించని వాయిదాలపై వడ్డీ వేస్తూ చక్రవడ్డీతో వెన్ను విరుస్తున్నారని, ఇక అలా చెయ్యకుండా బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్ధించారు.
లాక్‌డౌన్‌తో ప్రజల రాబడి పడిపోయిన క్రమంలో మారటోరియం సమయంలో కూడా రుణ వాయిదాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడం అన్యాయమని అన్నారు. ఈ మెలికలేమీ లేకుండా మారటోరియం అమలయ్యేలా, అదనపు వడ్డీ పడకుండా చూస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చే వారం విచారణ కొనసాగుతుందని తెలిపింది.