అసలే కరోనా కాలం. ఇలాంటివేళ ఎవరైనా సరే.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా కేసుల నమోదు తీవ్రత తగ్గిందే కానీ.. ఆ మహమ్మారి పూర్తిగా పోలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయినప్పటికీ.. కరోనా కష్టానని పట్టించుకోకుండా చేస్తున్న పనులు ఇప్పుడు కొత్త కష్టాల్ని తీసుకొస్తున్నాయి. ఐపీఎస్ అధికారిగా సుపరిచితుడు.. సార్వో సైన్యాన్ని తయారు చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తాజాగా బహుజన సమాజ్ వాదీ పార్టీలో చేరటం తెలిసిందే.
రెండు రోజుల క్రితం (ఆదివారం) ఆయన నల్గొడలోని ఎన్ జీ కాలేజీ మైదానంలో భారీ సభను నిర్వహించటం.. దీనికి పెద్ద సంఖ్యలో హాజరు కావటం తెలిసిందే. ఈ బహిరంగ సభ ఆసక్తికర చర్చకు తెర తీయటమే కాదు.. అధికార టీఆర్ఎస్ కు సరికొత్త సవాలుగా మారినట్లుగా మారింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో సీఎంపై ఇంత ఘాటైన వ్యాఖ్యలు అతి కొద్దిమంది నోటి నుంచే వచ్చాయని చెప్పాలి. అందులోనూ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య కాలం వరకు రాజకీయ నేపథ్యంలో లేకపోవటం.. ముక్కుసూటి అధికారిగా ఉన్న ఆయన నేతగా మారటం.. ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడటంతో.. ఆయన మాటలపై ఆసక్తి వ్యక్తమైంది.
రాజ్యాధికార సంకల్ప సభ పేరుతో నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ సమన్వయకర్త రామ్ జీ గౌతమ్ హాజరయ్యారు. ఆయన సమక్షంలోనే ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరటం తెలిసిందే. తాజాగా తనకు కరోనా పాజటివ్ గా తేలినట్లుగా ప్రవీణ్ పేర్కొన్నారు. ‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కొవిడ్ టెస్టు చేయించుకున్నా. పాజటివ్ గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకొని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగి వ్యక్తులు ఐసోలేట్ కావాలని.. తనకు తేలికపాటి లక్షణాలు ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వేలాది మందితో సభలు.. సమావేశాలు పెట్టటం ఏ మాత్రం మంచిది కాదు. కానీ.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా బహిరంగ సభల్ని ఏర్పాటు చేయటం.. కొవిడ్ మార్గదర్శకాల్ని పాటించకపోవటంలాంటివి తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వాటి కారణంగా కొత్త కేసులు పెరిగేందుకు కారణమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రవీణ్ కుమార్ కు స్వల్ప లక్షణాలే ఉండొచ్చు. మరి.. మిగిలిన వారి సంగతేంటి? ఈ సభ పుణ్యమా అని ఎంతమంది కరోనా బారిన పడతారు? అన్నది అసలు ప్రశ్న. నిన్నటికి నిన్న (సోమవారం) టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయటం.. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావటం తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారీ బహిరంగ సభలు ఏల ప్రవీణా?