కర్నాటకలో మంత్రివర్గం ఏర్పడి ఇంకా పదిరోజులు కూడా కాలేదు అప్పుడే ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మైకి అసమ్మతి సెగ మొదలైంది. తమకు కేటాయించిన శాఖలపై ముగ్గురు మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు గోడలమధ్య మాత్రమే తమ అసంతృప్తిని వ్యక్తంచేసేవారు. కానీ ఇపుడు మాత్రం తమకు కేటాయించిన శాఖలపైన, బొమ్మై పైన నేరుగా మీడియాతోనే తమ అసంతృప్తిని పంచుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ఎంటీబీ నాగరాజు, శ్రీరాములు, ఆనంద్ సింగ్ లు తమ అసంతృప్తిని నేరుగా బొమ్మైతో పాటు మీడియా ముందు కూడా వ్యక్తం చేశారు. నాగరాజు అయితే ఏకంగా తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా కూడా జనాలతో పంచుకోవటం విడ్డూరంగా ఉంది. తనకు ముఖ్యమైన శాఖలు కేటాయిస్తానని చెప్పిన బొమ్మై నిరాసపరిచినట్లు చెప్పారు. మూడు రోజులు వెయిట్ చేస్తానని తనకిచ్చిన మున్సిపల్, చిన్న తరహా పరిశ్రమల శాఖలను తప్పించి ప్రాధాన్యతున్న శాఖలను కేటాయించకపోతే రాజీనామా చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చేశారు.
ఇక శ్రీరాములైతే తనకు కేటాయించిన రవాణా శాఖతో తనకు సంతృప్తి లేదన్నారు. తనకు ఇంకా ప్రాధాన్యత ఉన్న శాఖలు కేటాయిస్తారని అనుకున్నట్లు చెప్పారు. బొమ్మై తనను తీవ్రంగా నిరాసపరిచినట్లు తెగ బాధఫడిపోతున్నారు. అసలు తనకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కుతుందని శ్రీరాములు ఆశించి భంగపడ్డారు. అలాంటిది నష్టాల్లో ఉన్న రవాణా శాఖను తీసుకుని ఏమి చేయాలంటు నిలదీస్తున్నారు.
ఇక పర్యావరణ, పర్యాటక రంగ శాఖల మంత్రి ఆనందసింగ్ కతేవేరు. తనకు దక్కాల్సిన శాఖల కోసం పోరాటం చేసైనా దక్కించుకుంటానని శపథం చేశారు. తనకు అన్యాయం జరిగితే చూస్తు ఊరుకునే రకం కాదని అయితే ఏమి చేస్తానో ఇప్పుడే చెప్పనని వార్నింగ్ కూడా ఇచ్చారు. తన విషయంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపైనే తాను ఏమి చేయాలనేది ఆధారపడుంటుందని గట్టిగానే చెప్పారు.
విషయం ఏమిటంటే ప్రతిమంత్రి కూడా తనకు ఆర్ధిక, రెవిన్యు, హోం లాంటి ముఖ్యమైన శాఖలనే కోరుకుంటే ఇక మిగిలిన శాఖలను ఎవరికి కేటాయించాలి ? మంత్రిపదవి దక్కితే చాలని ఒకవైపు ఎంఎల్ఏలు ఎదురుచూస్తుంటే మరోవైపు తమకు కేటాయించిన శాఖలపై మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేయటం చాలా విచిత్రంగా ఉంది. మొత్తానికి తాజాగా మొదలైన అసంతృప్తుల వెనుక మాజీ సీఎం యడ్యూరప్ప హస్తముందా అనే అనుమానాలు మొదలయ్యాయి. చూద్దాం నాలుగు రోజులాగితే ఏ విషయం బయటపడుతుందిగా.