అధ్యక్షునిగా ఎవరైనా ఒకటేనా ?

రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సారధిగా ఎవరున్నా ఒకటేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలన్న ఆలోచన కేంద్రంలోని పెద్దలకే లేనపుడు పార్టీ ఇక ఎలా బలపడుతుంది ? అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రప్రయోజనాలను తుంగలో తొక్కటమే టార్గెట్ గా పెట్టుకుని నరేంద్రమోడి సర్కార్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అదేదో ఏపిపై పగతోనే మోడి వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

రాష్ట్రప్రయోజనాలను తూచా తప్పుకుండా అమలు చేసుంటే అన్నా పార్టీకి జనాల్లో ఎంతో కొంత ఆదరణ పెరిగేది. అలాకాకుండా రివర్సులో విభజన చట్టాన్ని తుంగలో తొక్కేసిన ఫలితంగా అరా కొర ఉన్న పార్టీ పట్టు కూడా జారిపోయింది. పార్టీ తరపున ఎక్కడ పోటీచేసినా డిపాజిట్లు కూడా రావటంలేదంటే అందుకు కేంద్ర నాయకత్వాన్ని మాత్రమే నిందించాలి కానీ రాష్ట్ర పార్టీకి ఏమీ సంబంధంలేదు. అసలు మొదటినుండి ఏపిలో పార్టీకి ఉన్న బలమే అంతంతమాత్రం.

ఏదో బలమైన గాలి వీస్తేనో లేకపోతే గట్టి పార్టీతో పొత్తు పెట్టుకున్నపుడు మాత్రమే నాలుగు సీట్లు వస్తాయి. లేకపోతే కనీసం డిపాజిట్లు కూడా రాదు. ఇపుడు బీజేపీకి అధ్యక్షుడిగా సోము వీర్రాజున్నా ఒకటే ఆయన స్ధానంలో మరొకరున్నా ఒకటే. ఎందుకంటే పార్టీలోని నేతలు బలమైన వారు కాకపోవటం ఒకటైతే రాష్ట్రప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కుతుండుటం మరో కారణం. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణాలో పార్టీ బలంగా ఉందనే ప్రచారం కూడా ఉత్తదే.

ఎందుకంటే మొదటినుండి బీజేపీ ఏపీలో కన్నా తెలంగాణాలో గట్టిగానే ఉంది. బండి సంజయ్ వల్ల బలంతా తయారుకాలేదని గ్రహించాలి. ఎలాగంటే మొదటినుండి సికింద్రాబాద్ పార్లమెంటు సీటులో కమలం గెలుస్తోంది, ఓడుతోంది. అలాగే కిషన్ రెడ్డి అంబర్ పేటలో గెలుస్తున్నారు, ఓడుతున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు తెలంగాణాలో మరో మూడు నాలుగున్నాయి. అంతేకాని బండి వల్లే పార్టీ బలోపేతమయ్యిందేమీ లేదు.

ఏపితో పోల్చుకుంటే తెలంగాణాలో బీజేపీ కేసీయార్ ప్రభుత్వం మీద గట్టిగానే పోరాటాలు చేస్తున్నది నిజమే. ఎందుకంటే అందుకు కేంద్ర నాయకత్వమే ప్రోత్సహిస్తోంది కాబట్టి. బీజేపీకి కేసీయార్ కు బద్ధ విరోధముంది కాబట్టే కేంద్ర నాయకత్వం కూడా ప్రోత్సహిస్తోంది. అదే ఏపికి వచ్చేటప్పటికి పార్లమెంటులో మోడి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మద్దతు తీసుకుంటున్నారు. కాబట్టి జగన్ మీద కేంద్రానికి సాఫ్ట్ కార్నర్ ఉంది. పైగా ఏపిలో నేతలు కూడా క్షేత్రస్ధాయిలో బలమైన వారు కాదు. 2019 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట ఎంపిగా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు సుమారు 16500 మాత్రమే. కాబట్టి పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నా ఒకటే.