తెలుగు ప్రేక్షకుల సినీ అభిమానం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏమున్నా లేకున్నా మన జనాలకు సినిమా ఉండాలి. అందుకే గత ఏడాది కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడితే మన జనాలు అల్లాడిపోయారు. విరామం తర్వాత మళ్లీ థియేటర్లు తెరిస్తే కొత్త చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు. కానీ మళ్లీ కరోనా వచ్చి థియేటర్లను మూత వేయించింది.
గత నెలలోనే థియేటర్లపై ఆంక్షలు తొలగిపోయాయి. గత వారం కొత్త సినిమాలు విడుదలయ్యాయి కూడా. ఐతే రిలీజైనవి చిన్న చిత్రాలు కావడంతో పెద్దగా సందడి లేదు. పెద్ద సినిమాలు రావడానికి సంకోచిస్తుండటానికి కారణం.. ఏపీలో థియేటర్ల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడమే. ఏప్రిల్లో వకీల్ సాబ్ రిలీజైనపుడు టికెట్ల రేట్లపై నియంత్రణ తేవడం, దశాబ్దం కిందటి రేట్లను అమలు చేయడంతో ఏపీ థియేటర్లు సంక్షోభంలో పడ్డాయి. ఇప్పుడు కూడా అవే రేట్లు కొనసాగుతున్నాయి.
సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత కూడా పరిస్థితులు మారకపోవడంతో ఏపీలో థియేటర్ల వ్యవస్థే సంక్షోభంలో పడేలా ఉంది. ఐతే ఈ తీవ్రత గురించి ఎట్టకేలకు ప్రభుత్వం దృష్టికి సమాచారం చేరినట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు ఎగ్జిబిటర్లకు సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
సీఎం జగన్ వద్దకు విషయం చేరిందని.. త్వరలోనే థియేటర్లకు మంచి రోజులు వస్తాయని ఆయన హామీ ఇచ్చారట. ఐతే ఎగ్జిబిటర్లు కోరుకున్నట్లుగా కింది సెంటర్లలోనూ కామన్ రేటు రూ.100ను ఫిక్స్ చేసే అవకాశాలు మాత్రం లేవని సమాచారం. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో మినిమం టికెట్ రూ.100 ఉండేలా..మిగతా ప్రాంతాల్లో కనీస టికెట్ ధర రూ.60గా ఏండేలా ప్రభుత్వం త్వరలోనే జీవో ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మూసివేతకు సిద్ధమవుతున్న థియేటర్లను యధావిధిగా నడిపించడానికి ఎగ్జిబిటర్లు నిర్ణయించినట్లు సమాచారం.