ఆ కీలక పదవికి పీకే రాజీనామా..!

ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్.. మరో కీలక పదవి నుంచి తప్పుకున్నారు. త్వరలో పంజాబ్ రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిశోర్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.

ఇంతకాలం..పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రిన్సిపల్‌ సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్‌ కిషోర్‌ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రజా జీవితం లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు వీలుగా సలహాదారు పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

తన భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకో లేదని.. దయ చేసి తనను ఈ బాధ్యత నుంచి విముక్తిడిని చేయాలని ఆయన సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రశాంత్‌ కిషోర్‌ క్రియాశీల రాజకీయాల్లోకి దిగనున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా చేయడం ప్రస్తుత రాజకీయల్లో కొత్త చర్చకు తెర లేపింది.