ఎప్పుడు జరుగుతుందో తెలీని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక అన్నీ పార్టీల్లోను టెన్షన్ పెంచేస్తోంది. గెలుపే లక్ష్యంగా ప్రతిపార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే పార్టీలో తమ మద్దతుదారులతో సర్వేలు చేయించుకుంటున్నాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే కొన్ని సంస్ధలు స్వచ్చంధంగా నియోజకవర్గంలో సర్వేలు మొదలుపెట్టేశాయి. దాంతో హుజూరాబాద్ లో ఎక్కడ చూసినా సర్వేల హడావుడే కనబడుతోంది. దాంతో పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
పార్టీల సర్వేలు ఎలాగూ ఉంటుంది. అయితే అవి అంతర్గతంగానే జరుగుతుంది కాబట్టి బయటకు తెలిసేది తక్కువనే చెప్పాలి. పార్టీ నేతల ద్వారా సర్వేల వివరాలు బయటకుపొక్కుతుంటాయి. అయితే కొన్ని సంస్ధలు, మీడియా సంస్ధలు కూడా దేనికవే సర్వేలు మొదలుపెట్టేశాయి. ఒకేసారి ఇన్ని సంస్ధలు జననాడి తెలుసుకునేందుకు సర్వేలు చేస్తుండటం బహుశా హుజూరాబాద్ లోనే మొదటిసారేమో. చాలా సంస్ధలు తమ తరపున మండలానికి 100 మంది యువతను సర్వేకోసం ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం.
సర్వేపేరుతో నియోజకవర్గంలో ఏ మండలంలో చూసినా యువతే కనబడుతున్నారు. ఏ పార్టీ తరపున అభ్యర్ధిగా ఎవరుంటారు ? అసలు ఏ పార్టీకి ఓట్లేస్తారు ? బీజేపీ అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న ఈటల రాజేందర్ పై అభిప్రాయం ఎలాగుంది ? కేసీయార్ పాలన ఎలాగుంది ? ఈటలను టీఆర్ఎస్ లో నుండి పంపేయటంపై జనాలు ఏమనుకుంటున్నారు ? ఈటలను కేసీయార్ అవమానించారని అనుకుంటున్నారా ?
కాంగ్రెస్ పరిస్ధితి ఏమిటి ? కమలంపార్టీకి నియోజకవర్గంలో ఎంతబలముంది ? ఈటల హయాంలో నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా ? ఈటల బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగటంపై అభిప్రాయమేమిటి ? ఈటలపైన ఉన్న భూకబ్జాల ఆరోపణలు నిజమేనా ? కాంగ్రెస్ తరపున అభ్యర్ధిగా ఎవరుంటే బాగుంటుంది ? లాంటి అనేక ప్రశ్నలతో యువకులు సర్వేలు జరుపుతున్నారు.
అసలే వేడెక్కిపోయిన రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించేందుకు కేసీయార్ హుజూరాబాద్ లో ఈనెల 16వ తేదీన పర్యటించబోతున్నారు. దళితబంధు పథకాన్ని లాంచ్ చేయటానికి కేసీయార్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలుపై ప్రతిపక్షాలు, కులసంఘాలు తీవ్రంగా మండిపడుతున్న విషయం తెలిసిందే. పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా నియోజకవర్గంలో కేవలం 100 మందికి కాదని మొత్తం దళితులందరికీ వర్తింపచేయాలని పార్టీలు, దళితసంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి 16వ తేదీన కేసీయార్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates