ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో బహిష్కృత మంత్రి, మాజీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ మొదలుపెట్టిన ప్రజాదీవెన పాదయాత్ర అర్ధాంతరంగా ముగిసినట్లేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పాదయాత్ర విషయమై ఈటల నుండి కానీ లేదా అయన కుటుంబసభ్యుల నుండి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో ఈటల పాదయాత్ర ముగిసిపోయినట్లే అనే ప్రచారం పెరిగిపోతోంది.
ఎలాగైనా సరే తొందరలో జరగబోయే ఉపఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో జూలై 19వ తేదీన ఈటల పాదయాత్ర మొదలుపెట్టారు. నియోజకవర్గంలోని 112 గ్రామాల్లో 350 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని గట్టిగా అనుకున్నారు. శనివారం ఆయన కాలి సమస్య మొదలవ్వటంతో హఠాత్తుగా పాదయాత్రకు బ్రేక్ పడింది. దాంతో వెంటనే నిమ్స్ ఆసుపత్రిలో చేరి ప్రాధమిక చికిత్స చేయించుకున్నారు. అన్నీ పరీక్షలు చేసిన డాక్టర్లు మోకాలికి ఆపరేషన్ చేయాలని చెప్పారు.
కారణం ఏమిటో తెలీదు కానీ వెంటనే ఈటల నిమ్స్ నుండి అపోలో ఆసుపత్రికి మారిపోయారు. అక్కడ మళ్ళీ అన్నీ టెస్టులు చేయించుకున్నారు. అక్కడి డాక్టర్లు కూడా మోకాలికి ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పటంతో వెంటనే ఆపరేషన్ చేయించేసుకున్నారు. ఆపరేషన్ తీవ్రత కారణంగా భవిష్యత్తులో కాలిపై ఒత్తిడిపడేందుకు లేదని గట్టిగానే చెప్పారట. డాక్టర్లు చెప్పినదాని ప్రకారమైతే పాదయాత్రకు బ్రేకులు పడినట్లే అనే ప్రచారం పెరిగిపోతోంది.
యాత్రను అర్ధాంతరంగా ముగించేనాటికి 70 గ్రామాల్లోని 225 కిలోమీటర్లు మాత్రమే ఈటల కవర్ చేశారు. ప్రస్తుత అనారోగ్య పరిస్ధితులను గమనించిన తర్వాత పాదయాత్రకు స్వస్తిచెప్పాలని కుటుంబసభ్యులు కూడా గట్టిగానే చెబుతున్నారని సమాచారం. అనారోగ్యం నుండి బయటపడిన తర్వాత పాదయాత్రకు బదులుగా నియోజకవర్గంలో రోడ్డుషోలు నిర్వహిస్తే సరిపోతుందనే ప్రత్యామ్నాయాన్ని కూడా ఈటల కుటుంబసభ్యులు, మద్దతుదారులు సజెస్టు చేసినట్లు ప్రచారంలో ఉంది. మరి అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత ఈటల ఏమి నిర్ణయిస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates