దళిత బంధు పథకంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంపై అనుకూల , ప్రతికూల వాదనలు వినిపిస్తున్నారు. ఏదేమైనా ఈ స్కీంతో హుజురాబాద్ ఉప ఎన్నికలను టార్గెట్ చేశారన్నది నిజం. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ఒప్పుకొన్నారు కూడా. ఇదిలా ఉంటే, దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ చేస్తున్న సంక్షేమం రీతిలోనే బీసీల కోసం బీసీ బంధు ఎజెండా తెరమీదకు వచ్చింది. ఏకంగా ఈ స్కీం కోసం ఉద్యమం అనే ప్రతిపాదన తెరమీదకు వస్తోంది.
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ నుంచి దళితుల సంక్షేమం కోసం దళిత బంధు ప్రారంభిస్తున్నట్లే బీసీ బంధు కూడా ప్రారంభించాలన్నారు. రాష్ట్రమంతా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. బీసీ బంధు అమలు చేయకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బీసీ బంద్ అమలు చేయని పక్షంలో లక్షలాది మందితో పరేడ్ గ్రౌండ్ లో సభ పెడతామని కృష్ణయ్య ప్రకటించారు.
కాగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో దళిత బంధు పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు, అమలుకు సంబంధించిన కార్యాచరణ పనులు మొదలయ్యాయి. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న ఈ సంచలన పథకంలో ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నేరుగా అకౌంట్లో వేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం వలే బీసీలకు సైతం బీసీ బంధు అమలు చేయాలని ఆర్.కృష్ణయ్య తాజాగా డిమాండ్ చేశారు. దీనిపై గులాబీ దళపతి ఏ విధంగా స్పందిస్తారో మరి!