ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్టుగా.. ఉంది ఉమ్మడి కరీంనగర్లోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఘట్టం. ఇక్కడ ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు. కానీ, అధికార పార్టీ నేతల దూకుడు, అదేసమయంలో ఇక్కడ నుంచి గెలిచి.. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా అదే రేంజ్లో ప్రచారం ప్రారంభించారు. ఈటల పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు అధికార పార్టీ.. పథకాలతో ప్రజలకు చేరువ అవుతోంది. దీంతో.. ఇక్కడ రాజకీయం వేడెక్కింది.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. పాదయాత్ర చేస్తున్న ఈటల టార్గెట్గా.. కొందరు సోషల్ మీడియాను అడ్డాగా చేసుకుని.. ఈటలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఆయన కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మొదట్లో.. ఈటల రాజేందర్ తాను తప్పు చేశానని… క్షమించాలని కేసీఆర్కు రాసిననట్లుగా ఓ లేఖను వైరల్ చేశారు. నిముషాల వ్యవధిలో ఈ లేఖ వేలాది మంది చేరడం.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడం వంటివి తెలిసిందే. దీంతో వెంటనే స్పందించిన ఈటల పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
అయితే.. అక్కడితో.. ఈటలకు వేధింపులు ఆగలేదు. ఈటల బావమరిది దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను విస్తృతంగా వైరల్ చేశారు. ఇది మరింత వివాదంగా మారింది. టీఆర్ఎస్ వర్గాల్లో ఈ స్క్రీన్ షాట్లు మరింతగా.. వైరల్ అయ్యాయి. దీంతో ఈటల కేంద్రంగా విమర్శలు, వివాదాలు పెరిగిపోయాయి. ఆ వెంటనే కొందరు టీఆర్ఎస్ కార్యక్తలు.. మాజీ మంత్రి ఈటల దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన.. ఈటల సతీమణి.. జమున.. తీవ్ర విమర్శలు సంధించారు.
అయితే.. ఆ స్క్రీన్ షాట్లు ఎవరివి.. ఎవరు చాట్ చేశారు.. ఎవరి పేరు మీద ప్రచారం చేశారన్నది మాత్రం తెలియరాలేదు. మరో వైపు ఎన్నికలకు చాలా రోజుల సమయం ఉన్నప్పుడే.. ఈటల అనుచరులు గడియారాలు పంచుతున్నారని.. వాచీలు అందిస్తున్నారని.. టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఇదే విషయాలపై అధికార పార్టీ సొంత మీడియాలోనూ కథనాలు వచ్చాయి. అయితే.. ఎప్పుడో ఎన్నికలు పెట్టుకుని ఇప్పుడే ఎలా పంచుతారనే కనీసం అంశాలను సైతం ఎవరూ పరిగణనలోకి తీసుకోక పోవడం గమనార్హం. ఏదేమైనా.. ఈటల కేంద్రంగా సాగుతున్న ఈ వ్యతిరేక ప్రచారం మున్ముందు పెరుగుతుందో .. తగ్గుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates