కర్నాటకలో బీజేపీకి ఏమన్నా శాపముందా ?

ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. మామూలుగా ఏ రాష్ట్రంలో సీనియర్ నేత ముఖ్యమంత్రయితే ఐదేళ్ళ పూర్తికాలం సీఎంగా ఉంటారు. మధ్యలో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చి కోర్టుల్లో నిరూపణైతే మాత్రం మధ్యలోన పక్కకు తప్పుకుంటారు. అయితే కర్నాటకలో మాత్రం బీజేపీకి ఏదో శాపం ఉన్నట్లే అనిపిస్తోంది. అందుకనే అధికారంలోకి వస్తున్నా ఎవరు కూడా పూర్తి కాలం అధికారంలో ఉండలేకపోతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ దశాబ్దాలుగా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత కర్నాకటలో బోణికొట్టింది. మొదటసారిగా 2004లో 224 సీట్లలో అత్యధికంగా 79 సీట్లు గెలుచుకుని అధికారానికి దగ్గరైంది. అయితే కాంగ్రెస్+జేడీఎస్ పార్టీలు ఒకటవ్వటంతో బీజేపీకి నిరాసే ఎదురైంది. ఆ తర్వాత జేడీఎస్ తో బీజేపీ 2007లో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది.

అయితే అవినీతి ఆరోపణలతో యడ్యూరప్ప రాజీనామా చేయాల్సొచ్చింది. అప్పటినుండి సీఎంలుగా బాధ్యతలు తీసుకన్న బీజేపీ సీనియర్లు ఎవరు సీఎం పదవిని పూర్తికాలం అనుభవించిందిలేదు. యడ్డీ తర్వాత సీఎం అయిన సదానంద గౌడ్ కూడా మధ్యలోనే రాజీనామా చేసేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న జగదీష్ శెట్టర్ పదవి కూడా మధ్యలోనే ముగిసిపోయింది. ఆ తర్వాత యడ్డీ మరో మూడుసార్లు సీఎంగా బాధ్యతలు తీసుకున్నా ఎప్పుడు కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేదు.

జరుగుతున్నది చూసిన తర్వాత కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వస్తోందని సంతోషించాలో లేకపోతే ముఖ్యమంత్రి పదవిని ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా ఐదేళ్ళు పూర్తిచేయలేదని బాధపడాలో కమలనాదులకే అర్ధం కావటంలేదు. ఇపుడు కూడా యడ్డీ స్ధానంలో సీఎం అవ్వబోయే నేతకు మిగిలిన పదవీ కాలం మూడేళ్ళు మాత్రమే. మరి ఈ మూడేళ్ళయినా ఒకరే పదవిలో ఉంటారా ? ఏమో కాలమే సమాధానం చెప్పాలి.