ఏడుస్తూ రాజీనామా చేసిన సీఎం

క‌ర్ణాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. కేంద్ర నాయ‌క‌త్వం సూచ‌న మేర‌కు ఆయ‌న రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రిగా రెండు సంవ‌త్స‌రాల కాలం పూర్తి చేసుకున్న ఆయ‌న‌ను రాజీనామా చేయాల‌ని బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం కోరిన‌ట్లు తెలుస్తోంది. సీఎంగా రెండు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న రోజునే ఆయ‌న రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

సాయంత్రం నాలుగు గంట‌ల‌కు య‌డ్యూర‌ప్ప గ‌వ‌ర్న‌ర్ కు త‌న రాజీనామా లేఖ‌ను ఇవ్వ‌నున్నారు. ఈ రెండు సంవ‌త్స‌రాలు తాను ఏనాడూ సంతోషంగా లేన‌ని, ఎన్నో అగ్ని ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొన్న‌ట్లు తెలిపారు. నాలుగోసారి సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టిన ఆయ‌న ఏ ఒక్క‌సారి కూడా ఐదేళ్ల ప‌ద‌వీకాలాన్ని ఆయ‌న పూర్తి చేయ‌లేక‌పోయారు. త‌న రెండెళ్ల పాల‌న‌పై య‌డ్యూర‌ప్ప మాట్లాడుతూ క‌న్నీటిప‌ర్యంతం అయ్యారు. ఈ సాయంత్ర‌మే బీజేపీ అధినాయ‌క‌త్వం కొత్త సీఎం పేరును ఖ‌రారు చేయ‌నుంది.

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్-జెడీఎస్ కూట‌మి అధికారం చేప‌ట్టిన త‌ర్వాత నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఆ ప్ర‌భుత్వం కూలిపోయింది. ఆ స్థానంలో య‌డ్యూర‌ప్ప అధికారాన్ని చేప‌ట్టారు.

కాగా.. యడియూరప్ప రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ప్రధానంగా మురుగేష్ నిరాని, ప్రహ్లాజ్ జోషీ, అరవింద్ బళ్లాడ్ పేర్లు బిజెపి అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.