తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్న సంగతి తెలిసిందే. మాజీ మత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ నేపథ్యంలో మొదలైన ఈ వేడి పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికి అప్పగించడంతో తారాస్థాయికి చేరింది. అయితే, దీనికి కొనసాగింపుగా మరో ఇద్దరు మహిళ ముఖ్యనేతల మధ్య పోరుతో ఇంకా రంజుగా మారనున్నట్లు చెప్తున్నారు. ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత , టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకరైన ఎమ్మెల్యే సీతక్క గురించి.
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠను రేకెత్తించే వాటిలో సింగరేణి ఎన్నికలు ఒకటి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం. ఈ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్ 16 నాటికి ముగిసిపోయింది.
ఈ నేపథ్యంలో సింగరేణి కాలరీస్‌లో ఈ పోరు అంతకంతకు రాజుకుంటోంది. ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న అంచనాతో కార్మిక సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. దీంతో ఎన్నికల్లో గెలుపుకోసం అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అయితే, ముఖ్య కార్మిక సంఘాలకు ప్రధాన పార్టీలు అండగా ఉండటంతో సహజంగానే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) విజయం సాధించింది. కాలపరిమితి ముగిసిన వెంటనే గుర్తింపు సంఘం తప్పుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కరోనా ఉద్ధతి కారణంగా ఎన్నికలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగే అవకాశాలు ఉండగా టీఆర్ఎస్ అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తోంది.
చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కొందరు ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు కార్మికుల పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటుగా సింగరేణి కోసం మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇలా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున గెలుపు కోసం ఆ సంస్థ గౌరవ అధ్యక్షురాలైన ఎమ్మెల్సీ కవిత వ్యూహాలకు పదునుపెడుతున్నారు. కాంగ్రెస్ అనుబంధ సింగరేణి బొగ్గుగని లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ) తరఫున ఎమ్మెల్యే సీతక్కను బరిలోకి దించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య ప్రత్యక్ష పోరు జరగనుందని పలువురు అంచనా వేస్తున్నారు.