ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా ఉంది.. టీడీపీ నేతల పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేదెలారా .. నాయనా ? అని పార్టీ అధినేత చంద్రబాబు మథన పడుతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగాలి? జగన్‌ను ఎలా ఢి కొట్టాలి? అనే విషయంపై ఆయన తర్జన భర్జన పడుతున్నారు. కానీ, క్షేత్రస్తాయిలో నాయకులు మాత్రం.. ఆలు లేదు.. చూలులేదు..అన్నట్టుగా మంత్రివర్గంలో నాకు చోటు దక్కుతుంది! అని ప్రచారం చేసుకుంటున్నారు. సరే.. ఇలాంటి వారేమైనా.. యాక్టివ్‌గా భారీ ఎత్తున పార్టీ కోసం శ్రమిస్తున్నారా? అంటే.. లేనేలేదు. ఏదో మీడియా ముందుకు వచ్చి రెండు మాటలు అనేసి మళ్లీ ఇళ్లకే పరిమితమవుతున్నారు.
ఇటాంటివారిలో గుంటూరుకు చెందిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు జిల్లాలో ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ.. జిల్లా నుంచి కమ్మ సామాజిక వర్గంలో ఒకే ఒక్కరికి అవకాశం చిక్కింది. అయితే.. ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యారు. పార్టీలోనే ఉన్నప్పటికీ.. వాయిస్ వినిపించడం లేదు. పోనీ పార్టీ తరఫున కార్యక్రమాలైనా నిర్వహిస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. దీంతో ఆలపాటి.. కమ్మ వర్గం కోటాలో తనకు తిరుగులేదని.. తనకు దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. రాజధాని భూముల విషయంలో.. ఎస్సీ, ఎస్టీ రైతులపై కేసులు పెట్టిన నేపథ్యంలో రాజా.. బాగానే వాయిస్ వినిపించారు. కానీ, ఇది.. ఆయనకు వ్యక్తిగతంగా పేరు తీసుకురాలేదు. నలుగురితో నారాయణ అన్న విధంగా పార్టీ ఖాతాలోకే వెళ్లిపోయింది.
ఇక, ఇప్పుడు రాజా సొంత నియోజకవర్గం తెనాలి లో టీడీపీ కార్యకర్తలు పెద్దగా యాక్టివ్‌గా కూడా లేదు. 2014లో విజయం దక్కించుకున్న రాజా.. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదనే టాక్ ఉంది. ఇక, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయం దక్కించుకున్నారు. మరోసారి విజయం దక్కించుకునేందుకు ఆయన వ్యూహాత్మకంగా సాగుతున్నారు. వలంటీర్లు ఉన్నప్పటికీ.. ఆయన ప్రజలను ఏదో ఒక రూపంలో కలుసుకుంటున్నారు. అదేసమయంలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తన హవాను నిలుపుకొన్నారు. ఇటీవల ప్రభుత్వ నామినేటెడ్ కోటాలోనూ తన అనుచరులకు అంతో ఇంతో న్యాయం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
అదే.. రాజా విషయానికి వస్తే.. మాత్రం పూర్తిగా రాజకీయాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆయన గెలుపు గుర్రం ఎక్కడం అనేది .. మరో రెండేళ్లు ఆగిన తర్వాతే తప్ప.. ఇప్పుడు సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు. ఈ నేపథ్యంలో తన ఇమేజ్ పెంచుకునేందుకు, టీడీపీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాల్సిన రాజా మాత్రం కాబోయే మంత్రినంటూ.. అనుచరులతో ప్రచారం చేయించుకోవడం గమనార్హం. ఇటీవల దీనికి సంబంధించి పెద్ద ఫ్లెక్సీనే కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అయితే.. దీనిపై నారా లోకేష్‌కు ఫిర్యాదులు అందడంతో రాత్రికి రాత్రి దాన్ని తొలగించారు. మరి ఇంత ఉత్సాహం ఉంటే ఉండొచ్చు.. కానీ.. పార్టీని డెవలప్ చేయాలి కదా? అంటున్నారు పరిశీలకులు.