ఔను! టీడీపీ సైకిల్‌కు పంక్చర్లు పడుతున్నాయి. గత 2019 ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చాలా మంది నాయకులు జంప్ చేశారు. ఆ తర్వాత.. మరికొందరు వెళ్లాలని అనుకున్నా.. చంద్రబాబు ఏదో చేస్తారు.. వేచి చూద్దాం.. అనే ధోరణిని అవలంబించారు. కానీ, రెండేళ్లు గడిచినా.. అసంతృప్త నేతలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు.
ఈ క్రమంలో పలువరు నేతలు.. ఆయనకు విన్నపాలు చేసుకున్నారు. అయినప్పటికీ.. ఫలితం కనిపించలేదు. దీంతో మళ్లీ జంపింగుల పర్వం తెరమీదికి వచ్చింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు కీలక నేతలు.. పార్టీకి రాం రాం చెప్పారు.
విజయనగరం జిల్లాకు చెందిన మహిళా నేత, ఫైర్ బ్రాండ్ శోభా హైమావతి.. టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది మరిచిపోకముందే.. గుంటూరు జిల్లాలో కీలక నాయకుడిగా ఉన్న దివంగత లాల్ జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్.. జంప్ చేశారు. వీరిద్దరూ కూడా పార్టీకి మంచి నమ్మకస్తులుగా పేరున్న వారే.
పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 2014 ఎన్నికల సమయంలో బాగానే కష్టపడ్డారు. అయితే.. తర్వాత పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు వీరిని పట్టించుకోలేదు. దీంతో గడిచిన రెండేళ్లుగా వీరు చంద్రబాబుకు తమ కష్టాలు చెప్పుకొనేందుకు, పార్టీలో ప్రాధాన్యం ఉండేలా చూడాలని విన్నవించుకునేందుకు ప్రయత్నించారు.
కానీ, చంద్రబాబు వీరికి అవకాశం ఇవ్వలేదని.. పార్టీలో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ పరంపర ఇప్పటితో పోదని అంటున్నారు పరిశీలకులు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి నాయకులు పదుల సంఖ్యలో ఉన్నారని.. వారిని పట్టించుకుని.. సముచిత స్థానం కల్పించకపోతే.. పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
పోతే పోనీ.. మాది పొలిటికల్ ఇండస్ట్రీ.. ఎంతమందినైనా నేతలను తయారు చేసుకుంటాం! అనే ధీమా ఉన్నప్పటికీ.. వచ్చే ఎన్నికల నాటికి కొత్త నేతలు ప్రజల్లోకి వెళ్లేదెప్పుడు..? ఓటు బ్యాంకుగా మారేదెప్పుడు? అనే ప్రశ్నలకు టీడీపీలో సమాధానం లభించడం లేదు. మరి ఇప్పటికైనా.. చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకుని.. నేతలను కాపాడుకుంటే.. మంచిదనే సూచనలు వస్తున్నాయి.