తెలంగాణా ప్రభుత్వం హఠాత్తుగా దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కేసీయార్ ముఖ్యమంత్రయిన దగ్గర నుండి అమల్లోకి రాకుండా ఊరిస్తున్న ఈ పథకాన్ని ఒక్కసారిగా ప్రభుత్వం ఎందుకని అమల్లోకి తెచ్చేస్తోంది ? ఇక్కడ చాలామంది ఈటల రాజేందర్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అమల్లవాల్సిన దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీయార్ అమల్లోకి తేవాలని డిసైడ్ చేసిన విషయం తెలిసిందే.
ఏడు సంవత్సరాల క్రిందటి పథకం కనీసం హజూరాబాద్ ఉపఎన్నికల సందర్భంలో అయినా అందులోను హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతోందంటే అందుకు ఈటలే కారణమని చెప్పక తప్పదు. హుజూరాబాద్ లో సుమారు 35 వేలమంది దళితులున్నారు. పథకం ప్రకారం ప్రతి నియోజకవర్గంలోని మొత్తం దళితుల్లో 100 మందికి వర్తింపచేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ లబ్దిదారుల్లో ప్రతి ఒక్కరికీ రు. 10 లక్షలు అందచేస్తుంది ప్రభుత్వం.
వ్యాపారం చేయాలనే ఆసక్తి ఉన్న దళితులకు ఈ మొత్తం ఎతో ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నో బహిరంగసభలు నిర్వహించారు, ఎన్నో హామీలిచ్చారు కానీ దళితబంధు పథకాన్ని మాత్రం కేసీయార్ ఏడేళ్ళుగా అమలు చేయకుండా పెండింగ్ లోనే ఉంచారు. అలాంటిది హఠాత్తుగా పథకాన్ని అమల్లోకి తెచ్చేశారు. అదికూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు రూపంలో.
పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నే కేసీయార్ ఎందుకు ఎంచుకున్నారో అందరికీ తెలిసిందే. మంత్రవర్గం నుండి బహిష్కరణకు గురైన తర్వాత ఈటల రాజేందర్ ఎంఎల్ఏగా కూడా రాజీనామా చేసేశారు. తర్వాత బీజేపీలో చేరి మళ్ళీ ఉపఎన్నికలో పోటీకి రెడీ అవుతున్నారు. ఎలాగైనా ఈటలను ఓడించటం కేసీయార్ కు ప్రిస్టేజిగా మారిపోయింది. దాంతో ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు.
ఇది చాలదన్నట్లుగా దళితబంధు పథకం కూడా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయటంలోనే గెలుపుపై కేసీయార్లో టెన్షన్ అర్ధమైపోతోంది. సరే ఎవరు గెలుస్తారు ? ఎవరోడుతారన్నది జనాలకు అనవసరం. మొత్తానికి నియోజకవర్గమన్నా బాగుపడుతోంది అలాగే కొంతమంది దళితులకైనా పథకం అందుతోంది కదా. అందుకనే అందరు ఈటలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates