వైసీపీ అధికారంలోకి రాగానే.. ఆ పార్టీలోకి చేరిన వారిలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గానికి చెందిన పి. శమంతక మణి, ఆమె కుమార్తె యామినీ బాల తొలివరుసలో నిలిచారు. ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున గట్టి వాయిస్ వినిపించిన ఈ కుటుంబం.. అనేక పదులు కూడా పొందారు. టీడీపీ అంటే.. శమంతకమణి.. అన్న తరహాలో రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపించారు.
ఈ క్రమంలోనే 2014లో యామినీ బాల ఇక్కడ నుంచి టీడీపీ తరఫున విజయం దక్కించుకుని.. విప్‌గా కూడా పదవిని సొంతం చేసుకున్నారు. అయితే.. చంద్రబాబు మంత్రి వర్గ ప్రక్షాళన చేసిన సమయంలో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, దక్కలేదు.
దీనికితోడు.. నియోజకవర్గంలో యామినీ బాల రాజకీయాలు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని.. ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని.. వారికి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకున్నారని.. ఆమె వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడిందని.. పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో.. ఎన్నికల సమయానికి చంద్రబాబు.. ఆమెను తప్పించి.. బండారు శ్రావణికి అవకాశం ఇచ్చారు.
దీంతో యామినీ బాల వర్గం దూరంగా ఉంది. ఫలితంగా గెలుస్తుందని అనుకున్న శ్రావణి ఘోర పరాజయం పాలయ్యారు. ఇక, ఆ ఎన్నికల్లో అప్పటికి వరుస పరాజయాలు చవిచూస్తున్న జొన్నలగడ్డ పద్మావతి.. విజయం దక్కించుకున్నారు. అంటే.. టీడీపీలో అంతర్గత కలహాలే పద్మావతి విజయానికి దోహదం చేశాయనే వ్యాఖ్యలు వినిపించాయి.
సరే.. తర్వాత.. పరిణామాల నేపథ్యంలో యామినీ బాల, శమంతకమణిలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శమంతకమణి సీనియర్ నాయకురాలు కావడం.. వయోసంబంధిత సమస్యలు ఎదుర్కొంటుండడంతో ఆమె రాజకీయాలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. కానీ, యామినీ బాల పరిస్థితి అలాకాదు.
కనీసం మరో 20 ఏళ్లపాటు యాక్టివ్ రాజకీయాలు చేసే ఫ్యూచర్ ఉంది. అయితే.. టీడీపీని కాదని.. వైసీపీలోకి రావడంతో వచ్చినప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు ఆమెలో కనిపించడం లేదు. ఎమ్మెల్యే పద్మావతి చొరవతో వైసీపీ తీర్థం పుచ్చుకున్నా.. ఫ్యూచర్‌పై మాత్రం ఎవరూ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో యామినీ బాల.. టీడీపీ నుంచి రావడం తప్పయిందని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
వచ్చే ఎన్నికల పరిస్థితిని తలుచుకుంటే.. వైసీపీ తరఫున ఎలాగూ టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అదే టీడీపీలో ఉండి.. కొంచెం పనిచేసి ఉంటే.. ఖచ్చితంగా టికెట్ః దక్కడంతోపాటు.. విజయం కూడా సాధ్యమై ఉండేదనే వాదన ఆమె వర్గం నుంచి వినిపిస్తోంది.
ఇటీవల యామినీ బాల తన వర్గంతో భేటీ అయి.. ఫ్యూచర్‌పై ఆలోచించినప్పుడు.. మళ్లీ టీడీపీలోకి వెళ్తేనే ఫ్యూచర్ అనే మాట స్పష్టంగా వినిపించిందట. ఈ క్రమంలో వైసీపీలో కొన్నాళ్లు వేచి చూసి.. ఎలాంటి హామీ రాకపోతే.. తిరిగి సైకిల్ ఎక్కే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.