రాజకీయ సీనియర్ నేత, సుదీర్ఘ పాలనానుభవం ఉన్న నాయకుడు, రాష్ట్రం మొత్తానికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. త్వరలోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తనను రాజ్యసభకు ప్రమోట్ చేయాలని.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని కూడా ఆయన సీఎం జగన్‌కుస్పష్టం చేసినట్టు వైసీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆయన సొంత జిల్లా విజయనగరంలో బొత్సకు వ్యతిరేకంగా నాయకులు చక్రం తిప్పుతుండడం మరింత ఆసక్తిగా మారింది.
విషయంలోకి వెళ్తే.. మూడున్నర దశాబ్దాలకు పైగానే బొత్స సత్యనారాయణ.. విజయనగరం జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ మద్దతుతో ఆయన చెలరేగారనే వార్తలు వచ్చేవి. ఈ క్రమంలోనే కుటుంబ రాజకీయాలను కూడా ఆయన పెంచిపోషించారు. సొంత కుటుంబానికి చెందిన వారిని రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా టికెట్లు కూడా ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన కనుసన్నల్లో జిల్లాను రాజకీయంగా ఓ మలుపుతిప్పారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు బొత్స కనుక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటే.. ఆయన ప్లేస్‌ను తన భార్య లేదా.. తమ్ముడికి అప్పగిస్తారని.. వార్తలు వస్తున్నాయి.
కానీ, బొత్సతో సరిపడని వారు.. మాత్రం ఆయన హవాను తగ్గించేందుకు, బొత్స ఫ్యామిలీ రాజకీయ చక్రాన్ని అడ్డుకునేందుకు కూటమి కట్టారని.. తెలుస్తోంది. వీరిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సహా.. ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, అలజంగి జోగారావులతో పాటు మరికొందరు.. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. వచ్చే కేబినెట్ విస్తరణలో .. బొత్సకు బద్ధ శత్రువు గా పేరున్న కోలగట్లకు బెర్త్ ఖరారవుతుందని.. దీంతో ఆయన వెంట నడవడం ద్వారా బొత్స కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టవచ్చని వీరు భావిస్తున్నారు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ.. శ్రీవాణికి పెద్దగా గుర్తింపు లేకపోవడం వెనుక బొత్సనే కారణమనే వాదన ఉంది. ఈ క్రమంలో అందరూ ఒకటై.. బొత్సకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్న విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం. మరిదీనిని బొత్స నేరుగా ఎదుర్కొంటారా? లేదా? అనేది వేచి చూడాలి. ఇదే జరిగితే.. మూడున్నర దశాబ్దాల బొత్స రాజకీయాలకు చెక్ పడినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates