మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ నేతగా ఉన్న ఈటల రాజేందర్.. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం బత్తినివానిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా జీవన యాత్ర పేరుతో 270 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది. ప్రారంభానికి ముందు ఈటల సతీమణి జమున వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా తొలిరోజు పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 127 గ్రామాల మీదుగా 23 రోజుల పాటు జరిగే ఈ యాత్ర 270 కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
అయితే.. ఈటల యాత్ర ఎవరికి లాభం చేకూర్చుతుంది? ఆయన వ్యక్తిగతంగా పుంజుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారా? లేక.. బీజేపీ పరంగా పార్టీ తరఫున ఆయన ఉపయోగపడతారా? అనేది ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈటల వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. బీజేపీని కేవలం.. తనకు అనుకూలంగా మార్చుకుని.. తన హవాను పెంచుకునేందుకు ఈటల ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. నిజానికి పాదయాత్ర అంటే.. బీజేపీ తరఫున చేస్తున్నట్టుగా లేదని.. కేవలం తన వ్యూహాన్ని అమలు చేసుకునేందుకు చేస్తున్నారని .. గుసగుసలు వినిపిస్తున్నాయి.
అదేసమయంలో బీజేపీ కూడా హుజూరాబద్ ఉప ఎన్నికపై తనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఈటలను ముందు పెట్టి పార్టీ పరంగా పుంజుకునేందుకు పావులు కదుపుతోంది. ఇదే జరిగితే.. తనకు ఇబ్బందులు తప్పవని.. ఈటల భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన సతీమణితో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారంటే.. గతంలో ఆయన ఇక్కడి సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని అనుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈటల మాత్రం టీఆర్ ఎస్ వ్యూహానికి అడ్డుకట్ట వేసేందుకు, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. అటు బీజేపీ-ఇటు ఈటల కూడా ఎవరి ప్రయోజనాలు వారు కాపాడుకునేలానే వ్యవహరిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates